Telangana Congress:తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు ఖరారు.. త్వరలోనే అధికార ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కనీసం 12 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యం పెట్టుకుంది. అందుకు తగ్గట్లు పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి.. బలమైన అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. సర్వేల ఆధారంగా గెలిచే నేతలకు మాత్రమే టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీటిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించి అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు.
అయితే ఇప్పటికే సగం సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన 16 స్థానాల్లో ఇటీవల బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన నలుగురికి సీట్లు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకానికి అదే స్థానం కేటాయించారనే ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సనీతా మహేందర్ రెడ్డికి చేవెళ్ల, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు సికింద్రాబాద్, సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్లు ఖరారు అయినట్లు సమాచారం.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు జానా రెడ్డికి నల్గొండ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజామాబాద్, సురేష్ కుమార్ షెట్కర్‌కు జహీరాబాద్ ఎంపీ టికెట్లు కేటాయించినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. వీరి అభ్యర్థిత్వానికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని వెల్లడిస్తున్నాయి. మిగిలిన సీట్లు కోసం కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
కాగా ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడంతో.. ఎంపీ ఎన్నికల్లోనూ దెబ్బ కొడితే ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం కానుందని అంచనా వేస్తోంది. అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించడానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. అలాగే బీజేపీ బలాన్ని కూడా భారీగా తగ్గించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆర్థికంగా, సామాజిక పరంగా బలమైన నేతలనే బరిలోకి దింపాలని డిసైడ్ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments