Telangana Congress leaders:సీఎం రేసులో పోటీ పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు తయారైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కాని అప్పుడే సీఎం పదవిపై పోటీ పెరిగిపోతుంది. బలమైన సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంకా ఎన్నికలే జరగలేదు.. ఫలితాలే రాలేదు.. అప్పుడే సీఎం నేనంటే నేన్నంటూ అరడజనుకు పైగా నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత జానారెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి సీఎం పదవి తననే వెతుక్కుంటూ వస్తుందని ప్రగాల్భాలు పలుకుతున్నారు.
నాక్కూడా సీఎం అయ్యే అవకాశం రావొచ్చు..
తాను పదవుల రేసులో లేను.. కానీ పదవులే రేసులో ఉండి తనను అందుకుంటాయని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి ఎలా అయ్యారో అలాగే తాను కూడా ముఖ్యమంత్రి అవచ్చొన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవట్లేదని.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హఠాత్తుగా రావొచ్చేమో.. ఏ పదవి వచ్చినా స్వీకరిస్తానన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ సీఎం చేయనన్ని శాఖలు తాను నిర్వర్తించానని పేర్కొన్నారు. 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చానని, 36 ఏళ్లకే మంత్రిని అయ్యానని.. తనకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందన్నారు.
కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపిన జానారెడ్డి వ్యాఖ్యలు..
జానారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపాయి. ఎందుకంటే కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. అప్పుడప్పుడు తప్పితే పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడా ఆయన పాల్గొనడం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయడం లేదు. మరి అలాంటప్పుడు జానారెడ్డి ఎలా సీఎం పదవి ఆశిస్తారని పార్టీలోని ఓ వర్గం నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తమ వర్గం నేతే ముఖ్యమంత్రి అవుతారనే చర్చ ఆ పార్టీలో గట్టిగానే సాగుతోంది. ఎవరికి వారు సీఎం కుర్చీ తమకే దక్కుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలా మొత్తం అరడజనకు పైగా నేతలు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు.
ముందు వరుసలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
సీఎం పదవి ఆశిస్తున్న వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందు వరుసలో నిలుస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకే ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. తాను అధ్యక్షుడిని అయ్యాకే పార్టీకి తెలంగాణలో ఊపు వచ్చిందనే అభిప్రాయంలో ఉన్నారు. పార్టీ పటిష్టతకు తాను చేసిన కృషిని అధిష్టానం కచ్చితంగా గుర్తిస్తుందని భావిస్తున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా తనకు కలిసివస్తుందని.. రాహుల్ గాంధీ, ఆశీస్సులు తనకు అనుకూలంగా ఉన్నాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రథమంగా వినిపిస్తున్న భట్టి విక్రమార్క పేరు..
సీఎం పదవి రేసులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేరు కూడా ప్రథమంగా వినిపిస్తోంది. పార్టీలో వివాదరహితుడిగా, హుందాగా వ్యవహరిస్తారనే పేరుంది భట్టికి. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం, దళిత వర్గానికి చెందిన నేత కావడం తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర నేతలు, జాతీయ నేతల్లో కానీ తనను వ్యతిరేకించే వారు ఉండరు అనే నమ్మకంలో ఉన్నారు భట్టి.
సోనియా అండ ఉందంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..
పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎంతో కాలం నుంచి పార్టీలోనే కొనసాగడం, సోనియా గాంధీ అండ తనకు ఉందనే భరోసాతో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో తనకు సభ్యత్వం కల్పించడం వంటివి చూస్తుంటే అధిష్టానానికి తనపై కచ్చితంగా నమ్మకముందంటున్నారు.
సైలెంట్‌గా ప్లాన్ చేస్తున్న కోమటిరెడ్డి..
ఇక ఈ రేసులో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. పైకి ఆశ లేనట్లే ఉంటున్నారు కానీ లోపల మాత్రం తనకు సీఎం ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా అధిష్టానం దగ్గర సైలెంట్‌గా తన ప్రణాళికలు అమలుచేస్తున్నారు. వీరితో పాటు బీసీ నేతలైన మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు కూడా సీఎం పదవి ఆశిస్తున్నారు. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? వస్తే సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుంది? అనే ఉత్కంట వీడాలంటే డిసెంబర్ 3వ తేదీన వచ్చే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments