Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు
- IndiaGlitz, [Saturday,December 09 2023]
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాలోని గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వీహెచ్, ఇతర సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సోనియా గాంధీ పుట్టినరోజు కేక్ కట్ చేసే హక్కు, అర్హత వీహెచ్‌కే ఉందంటూ ఆయనతో రేవంత్ రెడ్డి కేక్ కట్ చేయించారు. అనంతరం రేవంత్‌కు వీహెచ్ కేక్ తినిపించి ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం విశేషం.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం రోజునే తెలంగాణ ప్రకటన వచ్చిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చిన నిజమైన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కొనియాడాదరు.
2017 డిసెంబర్ 9న మొదటిసారి గాంధీభవన్‌లో కాలు పెట్టానని.. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా అడుగుపెట్టానని సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తల కృషితోనే ఈరోజు అధికార పార్టీ హోదాలో మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల్లో రెండింటిని సోనియా పుట్టిన రోజున ప్రారంభించడం సంతోషకరమని వెల్లడించారు.