CM Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారికి తన మనవడి తలనీలాల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శనానికి వెళ్లారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శ్రీవారి దర్శనానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళవారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రచన అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు.
దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం జరిగిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి వైపు పయణించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నింటిని పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమలలో సత్రాలు, కల్యాణ మండపం నిర్మించి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో భాగస్వామ్యం తీసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు త్వరలోనే కాబోయే ఏపీ సీఎంను కలిసి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
మరోవైపు ఇటీవలే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ఈ సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు నష్టపోకుండా చివరి ధాన్యం వరకు కొనుగోలు చేయాలని సూచించారు.
వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌ఎస్‌డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా కేబినెట్‌లో చర్చించారు. అలాగే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాలు పలువురు కాంగ్రెస్ ప్రముఖులను ఆహ్వానించాలని చర్చించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments