ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు టీజీ సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో ప్రచారం ముగియనుంది. దీంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన మీద జగన్ చేసిన ఆరోపణలకు విలువ లేదన్నారు. ఇక సొంత చెల్లెళ్లు, కన్నతల్లి కూడా జగన్‌ను నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.
సొంత చిన్నాన్న హత్య గురించి తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సలహా ఇస్తున్నానని పేర్కొన్నారు. వివేకా బాబాయ్ హత్య అంశం.. వ్యక్తిగతంగా వారి కుటుంబ విషయం అయినా.. ప్రస్తుతం రాజకీయ వేదికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌పై ఉందని సూచించారు. తాను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగానని.. 2017లో ఆ పార్టీని వీడటంతోనే చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధం తెగిపోయిందని స్పష్టంచేశారు.
అయితే వ్యక్తిగతంగా తాము మాట్లాడుకోవచ్చు కానీ.. రాజకీయంగా ఎలాంటి బంధం లేదని వెల్లడించారు. తాను ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నానని.. ఏపీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని తెలిపారు. ఏపీలో తమ పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి తనవంతు సహకారం ఉంటుందని రేవంత్ తేల్చిచెప్పారు.
కాగా చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించినట్టే అవుతుందన్నారు. చంద్రబాబును గెలిపించేందుకే ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని.. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. చంద్రబాబు పగలు బీజేపీతో కాపురం చేస్తారు, రాత్రి కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout