సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం.. మేనమామ కమలాకర్ రావు కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ గునిగంటి కమలాకర్ రావు (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కామారెడ్డిలో దేవి విహార్‌లోని తన సొంత ఇంటిలో శనివారం చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్ రావు చాలా కాలం క్రితమే కామారెడ్డిలో స్ధిరపడ్డారు.
ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేనమామ చనిపోయిన విషయం తెలిసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు చిన్నతనం నుంచి ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తన బాల్యంలో చాలా సార్లు తాను మేనమామ ఇంటికే వస్తుండేవాడినని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారు. అధికారిక కార్యక్రమాల కోసం కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్ తన మేనమామ ఇంటికి వెళ్లేవారు. పదేళ్ల క్రితమే కమలాకర్ రావు భార్య చనిపోయారు. ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతంగా నడుపుతున్నారు.
మరోవైపు, కమలాకర్ రావు భౌతిక కాయాన్ని సందర్శకుల కోసం కామారెడ్డిలోని దేవివిహార్‌లో ఉంచారు. బంధుమిత్రులతో పాటు కొంత మంది స్థానిక టీఆర్ఎస్ నేతలూ సైతం కమలాకర్ రావుకు నివాళులర్పించారు. అనంతరం సమీపంలోని స్మశానవాటికలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపపథ్యంలో కమలాకర్ రావు అంత్యక్రియలకు కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments