పాక్, కేంద్రంకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో ఏకపక్షంగా టీఆర్ఎస్‌ను గెలిపించిన రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాడు ప్రగతి భవన్‌లో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. మున్సిపల్ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని.. టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్, కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కేంద్రంపై విమర్శలు!
‘కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు. కేంద్రం ఆలోచనా సరళి కూడా సరిగా లేదు. ఒక్క తెలంగాణకే కేంద్రం రూ.5 వేల కోట్లు బాకీ పడింది. కేంద్రం మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. ఐజీఎస్టీ కింద రూ.2012 కోట్లు రావాల్సి ఉంది. గత ఐదేళ్లు తెలంగాణ.. భారత్‌లోనే నెంబర్‌వన్‌గా ఉంది. ప్రతి సంవత్సరం 21శాతం మన పెరుగుదల ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో 9.5శాతం గ్రోత్ ఉంది. పౌరసత్వ సవరణ కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయం. కులాలు, మత విశ్వాసాలకు అతీతంగా భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు ఇస్తోంది. అందుకే కేంద్రం వైఖరిని, అమిత్ షా ధోరణిని మేం సమర్థించం’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
10 లక్షల మందితో భారీ సభ!
‘370 చట్టం రద్దును మేం సమర్థించాం, అది దేశానికి సంబంధించిన విషయం. పిడికెడంత దేశం పాకిస్థాన్ వెర్రి వేషాలు వేస్తే మేం సహించం. కేంద్రం ధోరణిని వ్యతిరేకించేందుకు ప్రాంతీయ పార్టీల సీఎంల సదస్సు కూడా ఏర్పాటు చేస్తాను. భారతదేశం ప్రజల దేశంగా ఉండాలి, మత దేశంగా ఉండరాదు. సీఏఏను వ్యతిరేకిస్తూ మేం కూడా వందశాతం తీర్మానం చేస్తాం. దేశంపై మతతత్వ ముద్రపడుతుంటే మనం మౌనంగా ఉంటే విదేశాల్లో మన ప్రతిష్ట దెబ్బతింటుంది. విదేశాల్లో ఉండే మన పిల్లల భవిష్యత్‌కు అది క్షేమం కాదు. పౌరసత్వ సవరణ బిల్లు వందశాతం తప్పుడు బిల్లు. సీఏఏను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కొట్టిపారేయాలి. సీఏఏను వ్యతిరేకిస్తూ అవసరమైతే 10 లక్షల మందితో సభ నిర్వహిస్తాం’ అని కేసీఆర్ తెలిపారు.
బీజేపీకి ఏం తెలియదు..!
‘బీజేపీకి మత రాజకీయాలు తప్ప... వేరే తెలియదు. భైంసాలో జరిగింది దుర్మార్గమే. భైంసాలో అల్లర్లు చేసిన వాళ్లు కూడా వీళ్లే. భైంసాలో పరిస్థితిని అదుపు చేసి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాం. దేశానికి ఫెడరల్ విధానమే శ్రీరామరక్ష. దేశంలో కర్ర పెత్తనాలు పనికిరావు. దేశంలో ఫెడరల్ ప్రభుత్వం రాబోతోంది’ అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout