BRS - KCR : ‘‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’.. ఇదే మన నినాదం, కర్ణాటక నుంచే బీఆర్ఎస్ ప్రస్థానం : కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే దేశంలో కారు చీకట్లు కొనసాగుతూనే వుంటాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. శుక్రవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాజకీయాలంటే గెలవడం, ఓడిపోవడం కాదన్నారు. పిడికెడు మందితో ప్రారంభించిన టీఆర్ఎస్ తర్వాత వేలై, లక్షలై ఉప్పెనలా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని కేసీఆర్ గుర్తుచేశారు. ఇవాళ మన పార్టీ సభ్యుల సంఖ్య 60 లక్షలని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఛైర్మన్లు, సర్పంచ్‌లుగా సేవలందిస్తున్నారని సీఎం అన్నారు.
భారత్‌కున్న వనరులు ఏ దేశానికీ లేవు:
కరోనా సమయంలో దేశమంతా ఆర్ధికంగా ఇబ్బందులు పడినా తెలంగాణ మాత్రం క్రమశిక్షణతో నిలదొక్కుకున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణానే ఇంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని.. రత్నగర్భ అయిన భారతదేశాన్ని ఇంకెంత గొప్పగా అభివృద్ది చేసుకోగలం అని సీఎం ప్రశ్నించారు. భారత్‌లోని జలవనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతావరణం ప్రపంచంలో మరే దేశానికీ లేదన్నారు. దేశంలోని మానవ వనరులను వాడుకోలేకపోతున్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు:
దేశంలో యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశ ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం వుందన్న ఆయన.. గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి , 70 వేల టీఎంసీల నీటి వనరులుండి రైతుల ధర్నాలు ఇంకెంతకాలమని కేసీఆర్ ప్రశ్నించారు. దేశానికి నూతన వ్యవసాయ విధానం అవసరమన్న ఆయన... అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలోని నీటి సమస్యపై బాలచందర్ ‘‘తన్నీర్ తన్నీర్’’ అనే సినిమా చేస్తే ప్రజలు దానిని సూపర్‌హిట్ చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వున్న వివాదాన్ని సరిదిద్దాల్సిన అవసరం వుందన్నారు.
కర్ణాటక నుంచే బీఆర్ఎస్ జాతీయ ప్రస్థానం:
వచ్చే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్ధతుగా వుంటుందని, ప్రచారంలో పాల్గొంటామని సీఎం అన్నారు. మరోసారి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్ణాటకతోనే ప్రారంభం అవుతుందని సీఎం అన్నారు. తెలంగాణలో అమలౌతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను కర్ణాటక ప్రజలకు కూడా వివరిద్దామని కేసీఆర్ సూచించారు. కర్ణాటక ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని జేడీఎస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
డిసెంబర్ 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం:
తెలంగాణ సాధన కోసం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రజల్లో వెళ్లామని.. నేడు భారతదేశ అభివృద్ధే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెందామని కేసీఆర్ తెలిపారు. డిసెంబర్ 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఆ రోజు నుంచే బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని... పార్టీ నేతలంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మరికొద్దినెలల్లో బీఆర్ఎస్ భవనం నిర్మాణం పూర్తవుతుందని... తర్వాత అక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని సీఎం అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని పేర్కొన్నారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ విధాన ప్రకటన చేస్తామని కేసీఆర్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments