Cloudburst: భారత్‌లో ‘‘క్లౌడ్ బరస్ట్’’... భారీ వర్షాల వెనుక విదేశీయుల కుట్ర : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో నార్త్ టూ సౌత్ అన్న తేడా లేకుండా గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలతో శాస్త్రవేత్తలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ‘‘క్లౌడ్‌బరస్ట్’’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వరదల నేపథ్యంలో వరంగల్ నుంచి భద్రాచలం వరకు వరద ముంపు ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కుండపోత వర్షాల వెనుక కుట్రలు వున్నట్లు చెబున్నారని వ్యాఖ్యానించారు. కానీ దీని వెనుక నిజానిజాలు తెలియాల్సి వుందని.. విదేశీయులు కావాలనే మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ‘‘క్లౌడ్ బరస్ట్’’ చేస్తున్నారేమోనన్న అనుమానాలను కేసీఆర్ వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం అమర్నాథ్ యాత్ర వద్ద.. ఇప్పుడు తెలంగాణలోనూ భారీ వర్షాల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
ఎత్తైన ప్రాంతాల్లో కాలనీలు నిర్మిస్తాం:
అలాగే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలని సీఎం ఆదేశించారు. వరద బాధితులకు తక్షణమే రూ.10 వేల ఆర్ధిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించాలని సూచించారు. సింగరేణితో కలిసి ఇకపై గోదావరికి వరదలు వచ్చిన తట్టుకునేట్లు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎత్తైన ప్రాంతాల్లో రూ.1000 కోట్లతో కాలనీల నిర్మాణానికి సీఎస్ చర్యలు తీసుకుంటున్నారని సీఎం తెలిపారు. గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యారని ఆయన అన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు :
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను సీఎం అభినందించారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్ చేయ్యాలని కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తామని.. ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాద్రికి వస్తానని సీఎం వెల్లడించారు. రైతుల పంటలు నీట మునిగాయని... సమీక్షించి తగు సహాయం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రజలంతా మరో 15 రోజులు జాగ్రత్తగా ఉండాలని.. రిలాక్స్ కాకూడదని, అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout