CM KCR: వియ్యంకుడు హరినాథరావు భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు... కోడలిని ఓదార్చిన సీఎం

  • IndiaGlitz, [Thursday,December 29 2022]

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా తండ్రి పాకాల హరినాథరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరినాథరావు కన్నుమూశారు . హరినాథరావు వయసు 72 సంవత్సరాలు. ఆయన భౌతికకాయాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌కు తరలించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, శైలమా దంపతులు నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలోనే వున్నారు.

హరినాథరావు నివాసానికి కేసీఆర్:

హరినాథరావు మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వియ్యంకుడి భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తండ్రి మరణంతో కన్నీటి పర్యంతమైన కోడలు శైలిమాను కేసీఆర్ ఓదార్చారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్‌, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి కూడా హరినాథరావు భౌతికకాయానికి నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టించారు.

రిటైర్మెంట్ తర్వాత ఇంటికే పరిమితమైన హరినాథరావు:

హరినాథరావు గతంలో డీహెచ్‌ఎఫ్‌వోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఇక కేటీఆర్, శైలిమాల వివాహం 2003 డిసెంబర్ 18న జరిగింది. ఈ దంపతులకు కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య వున్నారు. కేటీఆర్ రాజకీయాలు, పరిపాలనలో బిజీగా వుండటంతో పిల్లల బాధ్యతను శైలిమ తీసుకున్నారు. ప్రతీ విసయంలోనూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పండుగలు, శుభకార్యాలలో తప్పించి శైలిమ పెద్దగా మీడియాలో కనిపించరు.