KCR:తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ శుభవార్త .. ఆగస్ట్ 3 నుంచి రుణమాఫీ ప్రక్రియ షురూ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. తాజాగా అన్నదాతలకు ఊరట కలిగించే న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీని తిరిగి ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 3 నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. అన్నదాతల సమస్యలు, రైతు రుణమాఫీపై బుధవారం ప్రగతి భవన్లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు , కరోనా వల్ల వచ్చిన ఆర్ధిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం కక్షపూరిత చర్యల కారణంగానే రైతు రుణమాఫీ కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు.
రైతు సంక్షేమానికి కట్టుబడి వున్నాం :
రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఎన్ని కష్టాలు ఎదురైనా కొనసాగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యచరణను విస్మరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తామని.. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్ధికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించమన్నారు.
ఇంకా రూ.19 వేల కోట్ల రుణమాఫీ పెండింగ్ :
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 19 వేల కోట్ల రూపాయాల రైతు రుణమాఫీని చేయాల్సి వుందని సీఎం వెల్లడించారు. రైతు బంధు తరహాలో విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ.. సెప్టెంబర్ రెండో వారం నాటికి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులు హాజరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout