CM KCR:కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. టిక్కెట్ దక్కని ఇద్దరికి మంత్రులుగా ఛాన్స్, ఎల్లుండే ప్రమాణ స్వీకారం
- IndiaGlitz, [Monday,August 21 2023]
వచ్చే ఎన్నికలకు సంబంధించి 115 మంది అభ్యర్ధులతో బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. విపక్షాల కంటే ముందుగానే అభ్యర్ధుల జాబితాను ప్రకటించి బస్తీ మే సవాల్ అంటున్నారు. పనితీరు సరిగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగా పక్కనబెట్టారు. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసిన కొందరు సీనియర్లకు కూడా కేసీఆర్ టికెట్లు నిరాకరించారు. దీంతో అసంతృప్తులు అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
గంప గోవర్ధన్, పట్నం మహేందర్ రెడ్డిలకు ఛాన్స్ :
ఈ పరిణామాల మధ్య కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల మధ్య టికెట్లు దక్కని ఇద్దరికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. వారే ఎమ్మెల్సీ పట్పం మహేందర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్. నిజానికి ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నాటి నుంచి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరిగింది. కానీ హరీశ్ రావు అదనపు బాధ్యతలు అప్పగించి పుకార్లకు చెక్ పెట్టారు ముఖ్యమంత్రి.
కేసీఆర్ కొత్త లెక్కలు :
అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్ధితులు, కొన్ని లెక్కలను వేసుకుని మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాండూరు నుంచి టికెట్ కోసం తీవ్రంగా యత్నించారు పట్నం.. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే సీటు ఖరారు చేశారు సీఎం. అటు కామారెడ్డి నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన గంప గోవర్ధన్ ఈసారి కేసీఆర్ కోసం తన సీటు త్యాగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నపళంగా కేబినెట్ విస్తరణకు కేసీఆర్ ప్లాన్ చేశారు.
బుధవారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం :
బుధవారం రాజ్‌భవన్‌లో వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చాలా స్వల్పం. మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే వీరుగా పదవిలో వుంటారు. ఆపై అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే కీలక నేతలు కావడంతో వారు పార్టీ మారకుండా వుండేందుకు, మరికొన్ని లెక్కలు వేసి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.