నిరుద్యోగులకు తీపికబురు.. ఇవాళే 80,039 పోస్టులకు నోటిఫికేషన్, అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన

  • IndiaGlitz, [Wednesday,March 09 2022]

నిన్నటి వనపర్తి సభలో చెప్పినట్లుగానే .. ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. భారీగా ఉద్యోగాల నియామకాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు బుధవారమే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. మిగిలిన 11,103 ఖాళీలను కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని కేసీఆర్ తెలిపారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. కేవలం ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్‌తో పాటు నిరుద్యోగులకు మరో శుభవార్త కూడా అందించారు సీఎం. ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం.. శాఖల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,344, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులు వున్నాయి.