పద్శశ్రీ మొగిలయ్యకు కేసీఆర్ భారీ నజరానా.. ఇంటి స్థలం, రూ.కోటి రివార్డ్
- IndiaGlitz, [Saturday,January 29 2022]
ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మొగిలయ్య కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇంటి స్థలంతోపాటు నిర్మాణం కోసం రూ. కోటి నజరానా ప్రకటించారు కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మొగిలయ్యకు గౌరవ వేతనం కూడా ఇస్తామన్నారు. తెలంగాణ కళాకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని .. మొగిలయ్య తెలంగాణ కళను పునరుజ్జీవింపజేశారని ముఖ్యమంత్రి కొనియాడారు.
తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను కేసీఆర్ సర్కారు సత్కరించింది. అంతేకాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగిలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది.
తెలకపల్లి మండలం గుట్టరాయిపాకులలో పుట్టిన మొగిలయ్య... తన తాత, తండ్రి నుంచి వారసత్వంగా కిన్నెర వాయిద్యం నేర్చుకున్నారు. అనంతరం అవుసలికుంటలో స్థిరపడ్డారు. ఇంట్లో పూట గడవకపోయినా.. కిన్నెర కళనే నమ్ముకుని వూరురా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవారు. పల్లెపాటలు, సంగీతంపై ఉన్న అంకితభావం, గాత్రంలో ప్రతిధ్వనించే ప్రతిభే మొగిలయ్యను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మొగిలయ్య భార్య చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు ఆయన వివాహాలు చేశారు. పెద్ద కొడుకు హైదరాబాద్‌కు వెళ్లి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. రెండో కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతుండగా.. మూడో కుమారుడు పదోతరగతి చదువుతున్నాడు.