KCR:కేసీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం, 43 వేల కుటుంబాలకు లబ్ధి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో 43,373 మంది ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. వీరికి ఇకపై సర్కారే వేతనాలు చెల్లిస్తుంది. ఆర్టీసీ విలీనానికి సంబంధించి ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. ఈ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.
విలీనంపై ప్రత్యేక కమిటీ :
ఆర్టీసీని కాపాడేందుకు , ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు , సేవలను ఇంకా మెరుగుపరిచేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ మీడియాకు వివరించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు గాను ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన.. ఆర్ అండ్ బీ, రవాణా శాఖ, జీఏడీ శాఖ కార్యదర్శులు, కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.
కార్మికుల కల నెరవేరిందన్న పువ్వాడ :
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని ఆయన అన్నారు. కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని పువ్వాడ చెప్పారు. పెద్ద మనసుతో ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన వరమని.. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల మంది కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపారని అజయ్ కుమార్ కొనియాడారు. కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో చేర్చుకోవడం చిన్న విషయంకాదని, ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని ప్రశంసించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments