BJP Leader Son:ఆస్ట్రేలియాలో తెలంగాణ బీజేపీ నేత కుమారుడు మృతి

  • IndiaGlitz, [Friday,May 24 2024]

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం తాజాగా సముద్రంలో దొరికింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌‌‌కు చెందిన దివంగత బీజేపీ నేత అరటి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు అరవింద్ యాదవ్ ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఏడాదిన్నర క్రితం అరవింద్‌కు వివాహంకాగా.. ప్రస్తుతం భార్య గర్భిణిగా ఉంది. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి మే 20న షాద్ నగర్ వచ్చేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు.

అయితే అరవింద్ కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు.. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు మొదలు పెట్టారు. ఇంతలో అరవింద్ మృతదేహం సముద్రంలో లభ్యమైంది. అతడి కారును కూడా సమీపంలోనే గుర్తించారు. పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి అరవింద్ డెడ్‌బాడీ అని గుర్తించారు. అతడిది హత్యా?..ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అరవింద్ అకాల మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా అరవింద్ తండ్రి కృష్ణ యాదవ్ 2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త మరణం తర్వాత ఒక్కగానొక్క కుమారుడ్ని బాగా చదివించారు.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి చేశారు. అరవింద్ జీవితంలో బాగా స్థిరపడ్డాడు అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.