Bandi Sanjay:తోటి విద్యార్ధిపై దాడి, ముదురుతోన్న బండి సంజయ్ కుమారుడి వివాదం.. వెలుగులోకి మరో వీడియో

  • IndiaGlitz, [Wednesday,January 18 2023]

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తోటి విద్యార్ధిని కొట్టిన వీడియో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లొనే మహీంద్రా యూనివర్సిటీలో చదువుకుంటున్న సాయి భగీరథ్.. ఓ జూనియర్ విద్యార్ధిని చితకబాదాడు. అతనితో పాటు మరికొందరు కూడా బాధితుడిపై చేయి చేసుకున్నారు. అయితే తోటి విద్యార్ధులు దీనిని చిత్రీకరించడంతో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు సాయి భగీరథ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నా కొడుకును నేనే స్టేషన్‌లో అప్పగిస్తా :

దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని, పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మనవడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఖండించానని, కానీ తన కుమారుడిపై మాత్రం నాన్ బెయిల‌బుల్ కేసులు నమోదు చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి కేసు పెట్టారని.. తాను తప్పు చేశానని, అందుకే భగీరథ్ కొట్టాడని బాధితుడే చెప్పాడని సంజయ్ తెలిపారు. యాదాద్రి ఆదాయం, నిజాం మనవడి అంత్యక్రియలకు సంబంధించిన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ వీడియోను బయటకు తీశారని ఆయన ఆరోపించారు. తన కుమారుడిని తానే పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేస్తానని సంజయ్ స్పష్టం చేశారు.

బండి భగీరథ్‌ని సస్పెండ్ చేసిన మహీంద్రా యూనివర్సిటీ :

ఇప్పటికే ఓ విద్యార్ధిని సంజయ్ కొడుకు కొట్టిన వీడియో వైరల్ అవుతుండగా.. మరో వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. ఓ గదిలో భగీరథ్ సహా మరికొందరు విద్యార్ధులు కలిసి తోటి విద్యార్ధిని కొడుతున్నారు. మరోవైపు.. వరుస వివాదాలు, కేసుల నేపథ్యంలో సంజయ్ కుమారుడిని మహీంద్రా యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. దీనిపై యాజమాన్యం విచారణకు సైతం ఆదేశించినట్లుగా తెలుస్తోంది.