Telangana Formation Day: జీతాలకు నిధుల కొరతేంటీ .. తెలంగాణనూ శ్రీలంకలా మారుస్తారా: బండి సంజయ్
Send us your feedback to audioarticles@vaarta.com
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు కాషాయ జెండాతోనే నేరవేరతాయని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నమైందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్పూర్తితో ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ అమరు వీరుల ఆకాంక్ష కోసం బీజేపీ సాగిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీజేపీ మద్ధతివ్వకుంటే తెలంగాణ వచ్చేదా:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేవలం ఒక్క కుటుంబం వల్లే వచ్చిందనే దుష్ప్రచారం జరుగుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో యువకుల బలిదానాలను ఆపేందుకు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతివ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదే కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ ఏనాడూ పేరు కోసం పనిచేయలేదని.... తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అమరవీరుల ఆశయ సాధన కోసమే ఉద్యమించిందని గుర్తుచేశారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతోందని బండి సంజయ్ దుయ్యబట్టారు.
ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు:
అలాగే మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 14 వరకు బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో కుంభకోణాలు బయటపడ్డాయని.. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని ఆయన గుర్తుచేశారు. కరోనా సమయంలో దేశాన్ని ప్రధాని మోడీ కాపాడారని బండి సంజయ్ ప్రశంసించారు. కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయిన వారి కోసం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేసిందని.. పేదల కోసం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లంటూ కేసీఆర్ మోసం చేశారని.. ఇప్పటి వరకు కనీసం 10 వేల ఇళ్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అందజేయలేదని బండి సంజయ్ దుయ్యబట్టారు.
పేరు కోసం కేసీఆర్ పాకులాడుతున్నారు:
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎంఏవై కింద లక్షలాది ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫసల్ భీమా పథకాన్ని రాష్ట్రంలో నీరుగార్చారని సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితి ఎందుకొచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణను శ్రీలంకలా తయారు చేసే ప్రమాదం ఏర్పడిందని.. అక్కడి కుటుంబ పాలన తరహాలోనే ఇక్కడా కేసీఆర్ కుటుంబం పాలిస్తోందని ఆరోపించారు. పేరు కోసం సీఎం పాకులాడుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments