Download App

Tej I Love You Review

కెరీర్ ప్రారంభంలో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కి త‌ర్వాత విజ‌యాలు క‌రువు ప్రాంతంలో వ‌ర్షంలా త‌యారైంది. అలాగ‌ని త‌న ప్ర‌య‌త్న లోప‌ముందా? అంటే అదీ లేదు. త‌న శ‌క్తి మేర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్రయ‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. ఐదు ప‌రాజ‌యాల త‌ర్వాత తేజ్ చేసిన చిత్రం `తేజ్ ఐ ల‌వ్ యు`. `తొలిప్రేమ` వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌ను మెగా ఫ్యామిలీకి అందించిన ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ కూడా `డార్లింగ్` త‌ర్వాత విజ‌యాన్ని సొంతం చేసకోలేదు. ఈ ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్‌.. తేజులోని ల‌వ‌ర్‌బోయ్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌న‌దైన రీతిలో ప‌రిచ‌యం చేయ‌డానికి తెర‌కెక్కించిన `తేజ్ ఐ ల‌వ్ యు` త‌నకు ప‌రాజ‌యాల డ‌బుల్ హ్యాట్రిక్‌కి బ్రేక్ వేసిందో లేదో తెలుసుకోవాలంటే క‌థ గురించి తెలుసుకుందాం.

క‌థ‌:

జాగ‌ర్ల‌మూడి తేజ్ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌) చిన్న‌త‌నంలో ఓ ప‌ని చేసి ఏడేళ్లు జైలు శిక్ష అనుభ‌విస్తాడు. అయినా అత‌న్ని జాగ‌ర్ల‌మూడి కుటుంబం గుండెల్లో పెట్టుకుని పోషిస్తుంది. జైలుకి వెళ్లడాన్ని కూడా స‌హించిన ఆ కుటుంబం తేజ్ చేసిన మ‌రో పొర‌పాటును స‌హించ‌లేక‌పోతుంది. తేజ్‌ని ఇంటి నుంచి వెలేస్తాడు అత‌ని పెద‌నాన్న (జెపి). ఇంట్లో ఆడవాళ్లంద‌రూ తేజ్‌ని స‌పోర్ట్ చేస్తారు.  క‌థ ఇలా సాగుతుండ‌గా త‌న తల్లి ఆఖ‌రి కోరిక‌ను నెర‌వేర్చ‌డానికి ఇండియా వ‌చ్చిన నందిని (అనుప‌మ‌)ను చూస్తాడు తేజ్‌. తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే వారిద్ద‌రి మధ్య క్యాట్ అండ్ ర్యాట్ ఫైట్ న‌డుస్తుంటుంది. తీరా తేజ్‌కి త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను చెప్పాల‌నుకున్న నందినికి యాక్సిడెంట్ అవుతుంది. ఒక్క యాక్సిడెంట్‌తో ఆమె గ‌మ్యం మారిపోతుంది. ఆమె తండ్రి సీన్‌లోకి వ‌స్తాడు. తేజ్ క్ర‌మంగా దూర‌మ‌వుతాడు. కానీ నందినికి ఆమె తండ్రి వ‌ల్ల‌నే ముప్పు ఉంద‌ని తెలుసుకున్న తేజ్ ఆమెకు సాయప‌డాల‌నుకుంటాడు. అయితే అత‌ను ఎలా సాయం చేశాడు? క‌న్న కూతురికే ప్ర‌మాదం త‌ల‌పెట్టాల్సిన అవ‌స‌రం ఆమె తండ్రికి ఎందుకొచ్చింది? ఇంత‌కీ నందిని త‌ల్లి ఆఖ‌రి కోరిక ఏంటి?  తేజ్ ఏడేళ్ల జైలు శిక్ష‌కి, నందికి  చేయాల‌నుకున్న ప‌నికీ లింకేంటి? వ‌ంటివి సినిమా చూస్తే తెలుస్తాయి.

ప్ల‌స్ పాయింట్లు:

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న బావుంది. మ‌రీ ముఖ్యంగా లుంగీ గెట‌ప్‌లో బాగా క‌నిపించాడు. అమ్మాయి చేత సిగ‌రెట్ తాగించ‌డం స‌బ‌బు కాక‌పోయినా, ఆ సీన్‌లో అనుప‌మ బాగా చేసింది. హీరోతో, అత‌ని పెద్ద‌మ్మ ప్ర‌వ‌ర్తించే తీరు చూస్తే, ఇంట్లో మ‌న పెద్ద‌మ్మ‌లు కూడా ఇలాగే ఉంటారుగా అనిపిస్తుంది.

మైన‌స్ పాయింట్లు:

ప్రేమ క‌థా చిత్రాల‌కు డైలాగులు చాలా కీల‌కం. సంగీతం అంత‌క‌న్నా ముఖ్యం.  ఈ రెండు విష‌యాల్లోనూ ఆడియ‌న్స్ ని శాటిస్‌ఫై చేయ‌లేక‌పోయింది `తేజ్‌`. క‌రుణాక‌ర్ సినిమాల్లో నాయిక ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఈ సినిమా ఆవిష‌యంలోనూ ఫ్లాప్ అయింది. పైగా రొటీన్ క‌థ‌. ఎక్క‌డా కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. కామెడీ పెద్ద‌గా లేదు. వైవా హర్ష అండ్ టీమ్ ఉన్నా... స్క్రీన్ నిండుగా క‌నిపించ‌డానికి త‌ప్ప న‌వ్వించ‌డానికి ఒక్క‌రూ ముందుకు రాలేక‌పోయారు.

వివ‌ర‌ణ‌:

ఓ ప్రేమ‌క‌థా చిత్రం స‌క్సెస్‌కు ప్ర‌ధాన కార‌ణాలు క‌థ అనుకుంటే పొర‌పాటే.. ఎందుకంటే ప్రేమ‌క‌థా చిత్రాల్లో ప్రేమికులు విడిపోవ‌డం... క‌లుసుకోవ‌డం అనేది స‌ర్వ‌సాధార‌ణ‌మే. అయితే ద‌ర్శ‌కుడు దాన్ని ఎంత అందంగా చూపెట్టాడ‌నేదే ప్ర‌ధానంగా ఉంటుంది. అలాగే ప్రేమకు సంబంధించిన స‌న్నివేశాల్లో ఎమోష‌న్స్‌.. ఫ్యామిలీ మ‌ధ్య ఉండే బాండింగ్ స‌న్నివేశాల్లో ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావాలి. అలాగే ఇద్ద‌రు ప్రేమికులు క‌లుసుకునే సంద‌ర్భంలో వ‌చ్చే పెయిన్‌ని ప్రేక్ష‌కుడు ఫీల్ కావాలి. ఆ ఫీల్ తేజులో క‌న‌ప‌డ‌లేదు. అలాగే హృద‌యానికి హ‌త్తుకునే మాట‌లు.. సంగీతం.. నేప‌థ్య సంగీతం చాలా ముఖ్యం. ఈ మూడు విభాగాలు తేజ్ సినిమా విష‌యంలో ఘోరంగా చ‌తికిల‌బ‌డ్డాయి. హీరో చెల్లెలు కోసం కుటుంబానికి దూరం కావ‌డం.. ప్రేయ‌సి కోసం అబ‌ద్ధాలు ఆడ‌టం.. ఇవ‌న్నీరెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫార్మేట్‌లాగానే అనిపించింది. హీరో.. హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌ను బ‌లంగా చూపించే స‌న్నివేశాలు క‌రువైపోయాయి. ఇక క‌రుణాక‌ర‌న్ సినిమాల్లో ఓ కామెడీ ర‌న్ అవుతుంది. తేజ్ సినిమాలో ఆ కామెడీ ఘోరంగా ప్లాప్ అయ్యింది. సాగ‌దీత‌గా అనిపించే క‌థ‌, క‌థ‌నాలు ప్రేక్ష‌కుడికి బోర్ కొట్టిస్తాయి. గోపీసుంద‌ర్ అందించిన సంగీతం ఒక పాట బావుంది.. మిగిలిలిన పాట‌లు ఆక‌ట్టుకోవు. ఇక నేప‌థ్య సంగీతం స‌రేస‌రి.. అండ్రూ విజువ‌ల్స్ మాత్ర‌మే కాస్త బెట‌ర్‌గా అనిపిస్తాయి. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. సాయిధ‌ర‌మ్ తేజ్ హావ‌భావాల్లో ల‌వ్ ఎమోష‌న్స్‌ను ఇంకాస్త బెట‌ర్‌గా చేసుంటే బావుండేద‌నిపించింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న పాత్ర ప‌రంగా ఓకే అనిపించింది. జ‌య‌ప్ర‌కాశ్‌, ప‌విత్రాలోకేశ్‌, సురేఖావాణి, పృథ్వీ త‌దిత‌రులు వారి పాత్ర‌ల మేర న‌టించారు. మొత్తంగా చూస్తే తొలి ప్రేమ‌తో మ్యాజిక్ చేసిన క‌రుణాక‌ర‌న్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌లేక చేతులెత్తేశాడు.

బోట‌మ్ లైన్‌:  తేజ్ ఐ ల‌వ్ యు.. అని అంద‌రూ అన‌లేరు

Tej I Love You Movie Review in English

Rating : 2.3 / 5.0