Rishabh Pant: ఘోర రోడ్డు ప్రమాదం.. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలు, కాలి బూడిదైన కారు
Send us your feedback to audioarticles@vaarta.com
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. తన మెర్సిడెస్ కారును స్వయంగా నడుపుకుంటూ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ బయల్దేరారు పంత్. అయితే రూర్కీలోని నర్సన్ సరిహద్దులోని హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలో పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన కారు అద్దాలు పగులగొట్టుకుని దూకేశాడు. ఆ వెంటనే కారు అగ్నికీలకు ఆహుతైంది. ఈ ఘటనలో పంత్ తల, మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి.
కారులోంచి దూకేయకుంటే :
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి పంత్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్‌కు తరలించినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని, ప్రమాద సమయంలో రిషబ్ పంత్ ఒక్కరే కారులో వున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.పంత్ కారులోంచి దూకేయకుంటే పెను ప్రమాదం చోటు చేసుకునేదని స్థానికులు చెబుతున్నారు.
ధోని ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు :
మరోవైపు.. రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుసుకున్న టీమిండియా మాజీ , ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పంత్ మెరుగైన ప్రదర్శన చేసి.. జట్టు సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుటుంబ సభ్యులతో కలిసి రిషబ్ పంత్ దుబాయ్‌లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments