చిత్తూరులో స్కూల్‌నే బార్‌గా మార్చేసిన ‘నీచర్’!

  • IndiaGlitz, [Friday,March 26 2021]

ఆ ఉపాధ్యాయుడి పేరు కోటేశ్వరరావు అలియాస్ శ్రీధర్. పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్‌ ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. స్కూలు విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు.. ఆ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యా బోధన సమయంలో మద్యం సేవిస్తూ, విద్యార్థులను.. వారి తల్లిదండ్రులను ఇష్టానుసారంగా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడు. నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరై చిన్న చిన్న విషయాలకే విద్యార్థుల దుస్తులు విప్పి పైశాచికంగా ప్రవర్తిస్తుంటాడు.

విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు కోటేశ్వరరావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక గురువారం పాఠశాలనే బార్‌గా మార్చాడన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. కోటేశ్వరరావు వ్యవహారశైలిని వీడియో తీసి దానిని విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించారు. ఈ మొత్తం వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కోటేశ్వర రావును విధుల నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు డీఈవో నరసింహారావు గురువారం రాత్రి ప్రకటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు స్థానిక సర్పంచ్‌, స్కూల్‌ కమిటీ ఛైర్మన్‌, సీఆర్సీ, హెచ్‌ఎం సమక్షంలో విచారణ జరిపామని తెలిపారు.

గతంలో కూడా ఇలాగే...

విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వర రావు గతంలో కుప్పంలో పని చేసేవాడని.. ఆ సమయంలో కూడా ఇలాగే తాగి పాఠశాలకు హాజరయ్యే వాడని సమాచారం. రెండు నెలలక్రితం బదిలీపై కృష్ణాపురం పాఠశాలకు వచ్చిన ఈయన వ్యవహార శైలి మొదటి నుంచి అలాగే వుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అదేమని ప్రశ్నించిన తల్లిదండ్రులను ఇష్టానుసారంగా దూషించడం కోటేశ్వరరావుకు పరిపాటిగా మారింది. తాజాగా ఈ ఘటన. పాఠశాల వేళల్లో మద్యం సేవించడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.