సీఎం జగన్ ఆర్నెల్ల పాలనపై టీడీపీ పుస్తకం.. సంచలన విషయాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. ఆయన సీఎంగా ప్రమాణం చేయక మునుపునుంచే అనేక సంచలనాలకు తెరతీశారు. కీలక నిర్ణయాలు, అధికారుల మార్పులు, పలు సంచలన చట్టాలు, జీవోలు జారీ చేయడం ఇలాంటి అనేక కార్యక్రమాలను వైఎస్ జగన్ చేపట్టారు. అంతేకాదు.. కేబినెట్ కూర్పే ఒక సంచలన నిర్ణయమని చెప్పుకోవచ్చు. అయితే సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీ శ్రేణులు, మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున హడావుడే చేస్తున్నారు.
అయినా జగన్ మారలేదు..!
అయితే ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ.. జగన్ ఆరు నెలల పాలనపై పుస్తకాన్ని విడుదల చేసింది. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. వంద రోజుల పాలన తర్వాత అయినా జగన్ తన తీరు మార్చుకోలేదన్నారు. ఆరు నెలల జగన్ పాలనపై ఏదో ఘనకార్యం చేసినట్లు తన పత్రికలో రెండు పేజీలు రాసుకున్నారని మండిపడ్డారు. అయితే తాము ఆరు నెలల జగన్ హింసాయిత పాలనపై పుస్తకం విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..? అనేది ప్రజలకు వివరిస్తామన్నారు.
జగన్ మంచి సీఎం కాదు..!
‘జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా ముంచింది..? పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న వైనం, కానరాని అభివృద్ధి వంటి అంశాలను పుస్తకంలో ప్రచురించాం. జగన్ మంచి సీఎం కాదు.. జనాలను ముంచే సీఎం. ఆరు నెలల్లోనే అరాచక పాలనతో అందరినీ బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆర్ధిక వ్యవస్థ పటిష్ఠం చేయాలి. జగన్ పాలనలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. డబ్బు లేకుండా రోజుకో హామీ ఇచ్చు కుంటూ వెళుతున్నారు. రాష్ట్రానికి ఉండే సహజ సంపదను ప్రభుత్వంలో ఉన్న నేతల దోపిడీకి గురవుతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు.. వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. రూ. 21వేల కోట్ల రూపాయల ఆర్ధికలోటు ఉందని అంచనా వేశారు. టీడీపీ హయాంలో రెవిన్యూ పెంచామే కానీ అప్పులు చేయక తప్పలేదు. జగన్ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం కూడా పూర్తిగా చేయలేరని అందరికీ అర్ధమవుతోంది. ఏ ప్రభుత్వం అయినా అప్పులు తేవడం సహజం. ఐదేళ్లలో ఆ డబ్బుతో పోలవరం, రాజధాని, వంటి భారీ ప్రాజెక్టులు చేపట్టాం. ఆర్ధిక పరమైన ఎకానమీ లేకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది..?.
జగన్‌కు అవగాహన లేదు..!?
‘కనీస అవగాహన లేకుండా జగన్ ఎకానమీపై మాట్లాడతున్నారు. మూడు నుంచి నాలుగు శాతం ఎకానమీ ఇప్పటికే పడిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక 48 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారు. ఇప్పుడు మరో రూ. 14వేల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తోంది. వీటిని చూస్తే... ముందు ముందు జగన్ ఏమీ చేయలేరని అర్ధమవుతోంది. ఉద్యోగులకు జీత భత్యాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. నేను అవినీతి చేయడం లేదంటే ఎవరు నమ్ముతారు....?. ప్రతి శుక్రవారం కోర్టుకు వేళ్లే నువ్వు అవినీతిని అరికడతావా..?. ఇసుక అడ్డదారుల్లో రవాణా చేసి దోచుకుంటుంది ఎవరు..?. ప్రభుత్వ వాహనాల పేరుతో పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మీరు, మీ వారు బాగుపడటం తప్ప.. రాష్ట్రం మాత్రం వెనక్కే పోతుంది’ అని వైఎస్ జగన్ సర్కార్‌పై యనమల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాగా ఇప్పటి వరకూ టీడీపీ మాజీలు కానీ ఎమ్మెల్యేలుగానీ మీడియా లేదా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి విమర్శలు గుప్పించినా.. చర్యకు ప్రతి చర్య అన్నట్లుగా కౌంటర్ ఎటాక్ చేశారు. మరి టీడీపీ రిలీజ్ చేసిన పుస్తకంపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో..? యనమల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com