Geethanjali: గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

  • IndiaGlitz, [Thursday,March 14 2024]

ఏపీలో సంచలనం సృష్టించిన గీతాంజలి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయాన్నే విజయవాడకు చెందిన పసుమర్తి రాంబాబు ఇంటికి వెళ్లిన తెనాలి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే నోటీసులు ఇవ్వకుండా తాను ఎక్కడికి రానని ఆయన చెప్పినా.. పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌‌కు తరలించారు. రాంబాబును స్టేషన్‌కు తరలించకుండా ఎక్కడెక్కడో తిప్పుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల అరెస్టులపై టీడీపీ స్పందించింది. 'టీడీపీ కార్యకర్త , సోషల్ మీడియా యాక్టివిస్ట్ పసుమర్తి రాంబాబుని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నాం అని చెప్పి, ఊరు మొత్తం తిప్పుతున్నారు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పటం లేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయమే పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాబాయ్‌ని అడ్డంగా నరికించిన వాడి పాలనలో ఇంతకంటే ఏమి ఆశిస్తాం'అంటూ ట్వీట్ చేసింది.

కాగా తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలికి ఇటీవలే ప్రభుత్వం తరపున ఇంటిస్థలం పట్టా మంజూరు అయింది. పట్టాను స్థానిక ఎమ్మెల్యే చేతినుంచి అందుకున్న గీతాంజలి సంతోషంతో మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలను టీడీపీ, జనసేన కార్యకర్తలు విపరీతంగా ట్రోలింగ్ చేయడం వల్ల మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన మాత్రం ఆమె వీడియో వైరల్ కాక ముందే ప్రమాదానికి గురైందని ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు గీతాంజలి మృతిపై సీఎం జగన్ ఇప్పటికే స్పందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.20లక్షల ఆర్థిక సాయం అందించారు.