MLC Elections : వైసీపీకి షాకిచ్చిన పట్టభద్రులు.. మూడింట్లో రెండు టీడీపీకే, మరో చోట హోరా హోరీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి పట్టభద్రులు షాకిచ్చారు. శాసనమండలిలోని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో వేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీమ స్థానంలో కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమలోనూ వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. క్షణ క్షణానికి ఆధిక్యం మారుతూ వుండటంతో అభ్యర్ధుల్లో, పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో టీడీపీ ప్రభంజనం:
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో వేపాడ చిరంజీవి రావుకు వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. పోలైన 2,01,335 ఓట్లను 8 రౌండ్లలో లెక్కించగా.. తొలి ప్రాధాన్య ఓట్లలో టీడీపీకి 82,958 ఓట్లు.. వైసీపీకి 55,749 ఓట్లు వచ్చాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ నేత మాధవ్ సహా స్వతంత్ర అభ్యర్ధులు 33 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం విషయానికి వస్తే.. టీడీపీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్‌కు 1,12,686 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి శ్యాంప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. శుక్రవారం అర్ధరాత్రి శ్రీకాంత్ విజయాన్ని రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.
పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా :
పశ్చిమ రాయలసీమ విషయానికి వస్తే.. ఇక్కడ టీడీపీ , వైసీపీల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నడుస్తోంది. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 8 రౌండ్ల ఓట్లను లెక్కించారు. అప్పటి వరకు వైపీపీ అభ్యర్ధి రవీంద్రారెడ్డికి 74,678 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి రామ్‌గోపాల్ రెడ్డికి 73,229 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధి 1,449 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. మొత్తం 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి వుండగా.. తొలి ప్రాధాన్య ఓట్లను లెక్కించి, తర్వాత రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపడతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout