తెలుగుదేశం పార్టీలో విషాదం.. 102 ఏళ్ల యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు ఇకలేరు. ఆయన వయసు 102 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటు మంత్రిగానూ వెంకట్రావు పనిచేశారు. రైతు నాయకుడిగానూ.. సంగం డెయిరీకి వ్యవస్థాపక ఛైర్మన్‌గా యడ్లపాటి వెంకట్రావు సేవలందించారు.
1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా బోడపాడులో జన్మించారు వెంకట్రావు. తల్లిదండ్రులు యడ్లపాటి వెంకట సుబ్బయ్య, రాఘవమ్మ. గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ చదివిన ఆయన.. అనంతరం మద్రాసు లా కాలేజీలో చదువుతూ అందులో ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. అలవేలు మంగమ్మను పెళ్లాడిన వెంకట్రావుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగా ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకట్రావు 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున.. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా.. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. వయోభారంతో 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు వెంకట్రావు దూరంగా ఉన్నారు. యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments