సభ్యత్వ నమోదులో టిడిపి రికార్డు బ్రేక్
Send us your feedback to audioarticles@vaarta.com
- సభ్యత్వ నమోదులో సత్తా చాటిన తెలుగు దేశం పార్టీ
- 29రోజుల్లోనే 50లక్షలకు చేరుకున్న సభ్యత్వం
- లోకేష్ ఆదేశాలతో పార్టీలో సరికొత్త రిఫరల్ సిస్టంకు శ్రీకారం.. కష్టపడిన కేడర్ కు అభినందనలు
- దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా టీడీపీ
సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టిస్తోంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతూ చరిత్రను తిరగ రాస్తోంది. పార్టీ స్థాపించిన గత 43ఏళ్లలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అతితక్కువ సమయంలో అరకోటి సభ్యత్వం పూర్తిచేసి పసుపు జెండా సత్తా చాటారు. గత నెల 26వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. కేవలం 29 రోజుల వ్యవధిలో 50 లక్షల మార్కును దాటిపోయింది.
అధికారంతో సంబంధం లేకుండా తెలుగుజాతి ప్రయోజనాల కోసం 43ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పార్టీ తెలుగుదేశం. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయస్థాయిలో తమ గళాన్ని విన్పిస్తోంది. అధునాతన విధానాలతో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతానికి భిన్నంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగుతోంది.
లోకేష్ ఆదేశాలతో పార్టీలో సరికొత్త రిఫరల్ సిస్టంకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ముందు వరసలో నిలచిన వారిని మంత్రి లోకేష్ నేరుగా ఫోన్ చేసి స్వయంగా అభినందిస్తున్నారు. దీంతో శాసనసభ్యులు, రాష్ట్రస్థాయి నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. 100 రూపాయల సభ్యత్వంతో గతంలో రెండు లక్షల ఉన్న ప్రమాద బీమా ను ప్రస్తుతం ఐదు లక్షలకు పెంచారు.
రిఫరల్ సిస్టంలో కష్టపడిన కార్యకర్తను నేరుగా గుర్తించే విధానం అమల్లోకి తేవడంతో క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తోంది. తాజా విధానంలో బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు చేసిన ప్రతిపని కేంద్ర కార్యాలయంలో నిక్షిప్తమవుతుంది. ఏదేని పదవులకు అభ్యర్థులను ఎంపికచేసే సమయంలో సిఫారసులతో పనిలేకుండా నేరుగా గుర్తించి పదవులిచ్చే విధానం అమల్లోకి తెచ్చారు. ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితానే ఇందుకు నిదర్శనం.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాజంపేట నియోజకవర్గం 93,299 సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కుప్పం 82,176, కళ్యాణదుర్గం 77,720, పాలకొల్లు 72,720, మంగళగిరి 65,899 సభ్యత్వాలతో ముందు వరసలో ఉన్నాయి. ఇదిలాఉండగా చాలాకాలం తర్వాత తెలంగాణలో సైతం ఈసారి సభ్యత్వ నమోదు పుంజుకోవడం శుభ పరిణామం.
మంత్రి లోకేష్ నేతృత్వంలో కష్టపడిన కార్యకర్తను నేరుగా గుర్తించి గౌరవిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువనేత లోకేష్ బాధ్యతలు చేపట్టాక సరికొత్త పంథాలో ముందుకు నడిపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా చితికిపోయిన కార్యకర్తలకు బాసటగా నిలిచేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసారు. గత అయిదేళ్లలో రూ.135 కోట్లకు పైగా పార్టీ కేడర్ కు సాయం అందించారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేడర్ ను అక్రమ కేసుల నుంచి కాపాడుకునేందుకు కేంద్ర కార్యాలయంలో న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సభ్యత్వ నమోదుతో పాటు కష్టపడిన కార్యకర్తను గుర్తించడం తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణాధ్యాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments