Chandrababu Naidu:టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్.. నంద్యాలలో హైడ్రామా, కాసేపట్లో విజయవాడకు
- IndiaGlitz, [Saturday,September 09 2023]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా సీఐడీ ప్రకటించింది. శుక్రవారం రాత్రి నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్ కే ఫంక్షన్ హాల్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడి అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఆయనను విజయవాడ తరలించడానికి సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కాన్వాయ్‌లోనే ఎన్ఎస్‌జీ భద్రతతో విజయవాడకు తరలిస్తామని పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
తన అరెస్ట్‌పై చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేయడానికి ఆధారాలేవి అని అడిగానని.. ఎవరెన్ని కుట్రలు పన్నిని అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన హితవు పలికారు.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడకు సీఐడీ అధికారులు సీఆర్పీసీ 50(1) కింద నోటీసులు ఇచ్చారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 ఎండ్ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్ట్‌పై రెండు రోజుల క్రితమే చంద్రబాబు సంకేతాలిచ్చారు.. ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. తనపైనా దాడి చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పినట్లుగా పోలీసులు అరెస్ట్ చేయడం కొసమెరుపు.