కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు.. హౌస్ కస్టడీ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. తన రిమాండ్‌ను హౌస్ కస్టడీగా మార్చాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. జైలులో చంద్రబాబుకు భారీ భద్రత వుందన్న సీఐడీ తరపు న్యాయవాదుల వాదనతో కోర్ట్ ఏకీభవించింది. దీంతో సోమవారం ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
సోమవారం ముగిసిన వాదనలు :
నిన్న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా, ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపంచారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని వుందని, ఆయనను హౌస్ రిమాండ్‌కు అనుమతించాలని లూథ్రా వాదించారు. దీనిపై సీఐడీ తరపున పొన్నవోలు తప్పుబట్టారు. సెక్షన్ 167(2) కింద రెండు కస్టడీలు మాత్రమే వుంటాయని.. జ్యూడిషియల్ , పోలీస్ కస్టడీలు వుంటాయని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నవలఖా తీర్పును పరిగణనలోనికి తీసుకోవాలని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. అయితే నవలఖా తీర్పునకు, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని సుధాకర్ రెడ్డి వాదించారు. కొన్నాళ్లు జైలులో వుండి.. ఆరోగ్య కారణాలతో మాత్రమే హౌస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుందని చెప్పారు. సీఆర్‌పీసీ చట్టంలో హౌస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కడా లేదని, చంద్రబాబుకు జైలులో భారీ భద్రత కల్పించామని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో వున్నారని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నాలుగు కేసుల్లో చంద్రబాబు లాయర్ల బెయిల్ పిటిషన్ :
ఇకపోతే.. చంద్రబాబుపై నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, పుంగనూరు, అంగళ్లు అల్లర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం , విజయనగరంలోని కేసులకు సంబంధించి నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టులో ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ కేసులపై హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments