చంద్రబాబుకు షాక్.. బీజేపీలోకి ఎంపీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి టైటిల్ చూడగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని నెలరోజులు కూడా కాకముందే ఈ షాక్‌లు ఏంటి..? జంపింగ్‌లు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే టీడీపీ తరఫున అతి తక్కువ మెజార్టీతో గెలుపొందిన ఎంపీ.. ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు..? ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు..? ఆయనకు వచ్చిన ఇబ్బందులేంటి..? ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ లేని బీజేపీలోకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
టీడీపీ పెద్దల్లో కలవరం..!
రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ చేయడం కొత్తేమీ కాదు. మరీముఖ్యంగా పార్టీ అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం ఇప్పుడేం కొత్తకాదు.. ఎప్పట్నుంచో ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే.. ఏపీలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. వైసీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకోగా.. టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలు, 03 ఎంపీ స్థానాలు దక్కించుకో.. జనసేన పార్టీ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. అయితే ఫలితాలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ టీడీపీ, జనసేనకు చెందిన కీలక నేతలు, ద్వితియ శ్రేణి నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. తాజాగా.. విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. దీంతో టీడీపీ పెద్దల్లో కలవరం మొదలైంది. ఈ మధ్య బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడం ఈ వార్తలకు మరింత బలమిస్తోంది.. నితిన్ గడ్కరీ ద్వారా కేంద్రంలోని అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
కారణం ఇదేనా..!?
కేశినేని నాని పార్టీ వీడటానికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో.. రామ్మోహన్ నాయుడికి టీడీపీ లోక్‌సభాపక్ష నేతగా అవకాశం కల్పించిన అధిష్టానం.. గల్లా జయదేవ్‌కు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఈ టెర్మ్‌లో అవకాశమిచ్చారు. అయితే ఇప్పుడున్న ఎంపీల్లో సీనియర్ అయిన తనకు ఎలాంటి పదవి లభించలేదనే భావనలో కేశినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అనుచరులు చెబుతున్నారు. దీంతో తనకు గౌరవం ఇచ్చే పార్టీలోకి వెళ్లాలని కేశినేని భావించారట. ఇదిలా ఉంటే త్వరలోనే కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీలో బలపడాలనే భావనలో ఉన్న బీజేపీ సైతం కేశినేని రాకను ఆహ్వానించిందని సమాచారం. పార్టీలో చేర్చుకోవడంపై ఆసక్తి చూపుతోందని టాక్. మొత్తానికి ఘోర ఓటమితో కుదేలైన టీడీపీకి విజయవాడ ఎంపీ నిజంగానే గుడ్ బై చెబుతారా లేక అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి.
ఇది కూడా కారణమేనా..!
ఎంపీ కేశినేని నానిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వం తనపై ఎక్కడ ఎంక్వయిరీ చేయిస్తుందో అని.. సేఫ్ జోన్లోకి వెళ్లాలని నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారడంలో ఇది కూడా ఒక కారణం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
చంద్రబాబుకు షాక్..!
పార్లమెంటరి విప్‌గా కేశినేనిని టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. బాబు ఈ ప్రకటన చేసి 24 గంటలు గడువక ముందే తిరస్కరించేశారు. దీంతో చంద్రబాబుకు పెద్ద షాక్ తగలినట్లైంది. విప్ పదవి తీసుకోనని నాని తేల్చేశారు. తనకు లోక్‌సభలో విప్ పదవి అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. తనకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని చంద్రబాబును నాని కోరారు. "అంత పెద్ద పదవికి నేను అనర్హుడినని భావిస్తున్నాను. విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమించమని కోరుతున్నా" అని కేశినేని ఫేస్బుక్లో స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో..? కేశినేని నిజంగానే కమలం గూటికి చేరిపోతారో..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments