Galla Jayadev: రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని ప్రకటించారు. తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను ఇబ్బందిపెట్టాయి. ఈ ఇబ్బందులతో పార్లమెంట్‌లో మౌనంగా ఉండలేను. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యా. రాజకీయాలు, వ్యాపారాన్ని సమన్వయం చేయడం కష్టంగా మారింది. పార్ట్ టైం రాజకీయాలు చేయడం కష్టం. రాజకీయాల్లో ఉంటే వ్యాపార సమస్యలు వస్తున్నాయి. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడాను. ఆ సమయంలో వివిధ కేసుల్లో ఈడీ తనను రెండు సార్లు పిలిచి విచారించింది. నా వ్యాపారాలపై నిఘా వేశారు. అయినా నేను భయపడలేదు. సీబీఐ, ఈడీలు నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయి" అంటూ సంచలన విషయాలు వెల్లడించారు.
ఏపీలో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయి. దీంతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేశాం. విదేశాల్లోనూ పరిశ్రమలు విస్తరిస్తున్నాం. వ్యాపారాలపై పూర్తి దృష్టి పెట్టానుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తా. కానీ ఎంపీగా గెలిచిన పార్లమెంట్‌లో మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదు. ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగలేను. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా. శ్రీరాముడు వనవాసం విడిచి వట్టునట్టుగా దృఢంగా వస్తా. ఈసారి ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడిగానే వస్తా. వ్యాపారం అయినా, రాజకీయాలు అయినా దేశం కోసం మాత్రమే చేస్తాను. రెండు సార్లు నన్ను గుంటూరు ఎంపీగా గెలిపించిన గుంటూరు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను" అని ఆయన వెల్లడించారు.
కాగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గల్లా జయదేవ్.. టీడీపీ నుంచి 2014, 2019లో రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. ఉన్నత విద్యావంతుడిగా, పారిశ్రామికవేత్తగా తనదైన ముద్రవేశారు. అమరరాజా బ్యాటరీస్ చైర్మన్‌గా వ్యాపారాలు చేస్తున్నారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. ప్రిన్స్ మహేశ్ బాబు బావగా జయదేవ్‌కు మంచి పేరు ఉంది. అయితే ప్రతిపక్ష ఎంపీగా తన వ్యాపారం విస్తరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. గల్లా నిర్ణయంతో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా మరో కీలక నేతను టీడీపీ అధినేత చంద్రబాబు అన్వేషించే పనిలో పడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments