అసెంబ్లీని కుదిపేసిన జంగారెడ్డి గూడెం ఘటన.. ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల ఘటనపై చర్చించాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుబట్టింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేసినా విపక్ష సభ్యులు శాంతించ లేదు. ఉదయం నుంచి పోడియంను చుట్టుముట్టి చర్చకు పట్టాబట్టారు. దీంతో సభలో గందగోళం సృష్టించింది.
టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌ను సక్రమంగా నడపాల్సిన ప్రతిపక్షం అడ్డుకోవడం మంచి పద్దతి కాదని... మిగతా సభ్యుల హక్కులను హరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కావాలనే అల్లరి చేయాలనే వ్యూహంతో ఛైర్‌ను చుట్టుముట్టి హంగామా చేస్తున్నారని సభాపతి దుయ్యబట్టారు.
దీంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పబ్లిక్‌కు తప్పుడు సంకేతం పంపించాలనే ఉద్దేశంతోనే టీడీపీ సభ్యులు హంగామా చేస్తున్నారని ... తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని బుగ్గన పేర్కొన్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభను విడిచిపెట్టి వెళ్లకుండా పోడియం చుట్టుముట్టి నిరసన కొనసాగించారు. అనంతరం మార్షల్స్ రంగ ప్రవేశం చేసి సస్పెండ్ అయిన సభ్యులను బయటకు తీసుకుపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments