వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే.. అలీకి లైన్ క్లియర్!?
- IndiaGlitz, [Thursday,January 24 2019]
టీడీపీ నుంచి మరో ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్తున్నారా..? ఆయన జంప్ అయితే కమెడియన్ అలీ పంటపండినట్లేనా..? ఇన్నాళ్లు పార్టీల అధినేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన అలీకి టికెట్ ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైందా..? అలీ టికెట్‌కు టీడీపీ ఎమ్మెల్యేకు ఎందుకు లింకులు పెట్టారు..? అసలు వైసీపీలోకి జంప్ అవ్వాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయనెందుకు సైకిల్ దిగాలనుకుంటున్నారు..? అలీ ఎందుకు సైకిలెక్కాలనుకుంటున్నారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైనల్‌గా ఫిక్స్ చేసేశారుగా..!
2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసి తీరాల్సిందేనని కంకణం కట్టుకున్న కమెడియన్ అలీ.. పార్టీల అధినేతలకు ప్రదిక్షణలు చేయడం మొదలెట్టేశారు. అప్పట్లో వైఎస్ జగన్, పవన్, చంద్రబాబుతో వరుసగా భేటీ అయిన అలీ ఇప్పటికీ భగీరథ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతుండటం.. మరోవైపు ఏ పార్టీ నుంచీ టికెట్‌పై స్పష్టమైన హామీ రాకపోవడంతో అసలు ఏం చేయాలో తెలియక ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి టికెట్ విషయమై మరోసారి విజ్ఞప్తి చేశారని సమాచారం. అయితే ఇప్పటికే రెండుసార్లు భేటీ కావడంతో గుంటూరు తూర్పు టికెట్ ఇవ్వాలని భావించిన టీడీపీ అధిష్టానం మనసు మార్చుకుని గుంటూరు పశ్చిమ టికెట్ ఇవ్వాలని ఫైనల్‌గా ఫిక్స్ అయిపోయిందట. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వాలని టీడీపీ అధిపతి యోచిస్తున్నారట.
టీడీపీకి టాటా చెప్పాలనుకుంటున్నదెవరు!?
గత కొద్దిరోజులుగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అసెంబ్లీలో, బహిరంగ సభల్లో టీడీపీపైనే విమర్శలు గుప్పించిన సందర్భాలు కోకొల్లలు. తెలుగుదేశం హయాంలో రెడ్లకు న్యాయం జరగలేదని అప్పట్లో హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్నుంచి టీడీపీ కార్యక్రమాలకు ఆయన పెద్దగా హాజరుకాలేదు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలో వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని మోదుగుల భావిస్తున్నారట. ఆయన పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఏదడిగినా ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందట. ఒక వేళ ఎమ్మెల్యేగా అయితే గుంటూరు పశ్చిమ నుంచి.. ఎంపీ అయితే నర్సారావు పేట నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. ఇప్పటికే ఆయన బావమరిది వరుసయ్యే వైసీపీ కీలకనేత, మరో ఇద్దరు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
మొత్తానికి చూస్తే.. గుంటూరు జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. గుంటూరు టీడీపీకీ కంచుకోట అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటూ ఉంటారు.. అయితే అదే కంచుకోటను ఆ పార్టీ నేతలను తమవైపు లాక్కొని వారిచేతనే బద్ధలు కొట్టించాలని వైసీపీ భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయ్..? టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి వస్తే పరిస్థితేంటి..? అలీకి నిజంగానే మంచిరోజులొస్తాయా..? లేకుంటే తిరిగి సినిమాల్లోకే వచ్చేస్తారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.