రాజీనామాలు చేయకుండా ఈ ట్విస్ట్‌లేంటి.. తమ్ముళ్లూ!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అప్పుడెప్పుడో సార్వత్రిక ఎన్నికలకు ముందు మొదలైన చేరికలు.. స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత జోరు పెరిగాయ్. ఇప్పటికే పలువురు కీలక నేతలు.. ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరైపోయారు. చాలా మంది టీడీపీకి టాటా చెప్పేసి ఊహించని రీతిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే వాస్తవానికి వైసీపీలో చేరాలంటే కచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందేనని ఓ నిబంధనను సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టారు. అంటే.. ఎవరైనా సరే.. ఎంపీలు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు పార్టీలో చేరినా వారి వారి పదవులకు రాజీనామా చేసి కండువా కప్పుకోవాల్సిందే అన్న మాట.
హోదా హుష్!
అయితే ఈ మధ్య టీడీపీ నుంచి సుమారు 10 మంది దాకా వైసీపీలో చేరబోతున్నారని.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా హుష్ అని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే.. కొందరైతే తమ ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేయకుండానే వచ్చి వైసీపీలో వాలిపోతున్నారు. అదెలాగంటే జగన్‌ను కలవడం.. టీడీపీకి దూరంగా ఉండటం.. అవసరమైతే తన కుటుంబ సభ్యులనో.. లేదా కుమారుడ్నో జగన్ సమక్షంలో వైసీపీలో చేర్పించేసి ఇక తాము చేరనక్కర్లేదు.. తాము వైసీపీలో ఉన్నట్లేనని చెప్పేసుకుంటున్నారు. అయితే అసలు రాజీనామా ఎందుకు చేయట్లేదనేది ఇక్కడ అసలు పాయింట్. ఇలా తెలుగు తమ్ముళ్లు రాజీనామా చేయకుండా ట్విస్ట్‌లు ఇస్తుండటంతో అసలు తాము టీడీపీలో ఉన్నామా..? లేకుంటే వైసీపీలో ఉన్నామా..? అనేది తెలియక అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
రాజీనామా ఎందుకు చేయట్లేదు..!?
వాస్తవానికి రాజీనామా చేస్తే మళ్లీ ఉప ఎన్నికలొస్తాయ్.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం.. గెలిచి నిరూపించుకోవడం.. ఒకవేళ గెలవకపోతే పరిస్థితేంటి..? రాజీనామా చేస్తే మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తారనే నమ్మకాలు కూడా లేవ్. అందుకే అటు టీడీపీకి దగ్గరగా ఉండకుండా.. ఇటు వైసీపీలో పూర్తిగా చేరినట్లు కాకుండా.. ఇటు రాజీనామా చేసే పరిస్థితి రాకుండా కొందరు తెలుగు తమ్ముళ్లు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అదెలాగంటే అటు టీడీపీ.. ఇటు వైసీపీ కాకుండా ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరుతున్నారు. అధికారికంగా వైసీపీలో చేరకపోయినప్పటికీ.. జగన్ మనిషే అన్న మాట. ఇలా టీడీపీకి టాటా చెప్పిన వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఉండగా.. తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా చేరిపోయారు. అయితే బలరాం మాత్రం తన కుమారుడు కరణం వెంకటేశ్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కరణం వెంకటేశ్‌తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా జగన్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు.
రేపెవ్వరో..!
మొత్తానికి చూస్తే.. ఓ వైపు జగన్ మాత్రం జిల్లాల్లో తెలుగుదేశం అనే నామరూపాలు లేకుండా చేయడానికి మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లా పూర్తికాగా.. తాజాగా ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. రేపెవరు చేరుతారో..? ఏ జిల్లా ఖాళీ అవుతుందో..? ఏంటో..!. వైసీపీలో చేరాలనుకుంటున్న తెలుగు తమ్ముళ్లకు ఇదో సాకు మాత్రం బాగానే దొరికింది. టీడీపీకి దూరమైతే చాలు.. వైసీపీలో చేరకపోయినా.. ఒకట్రెండు సార్లు సీఎం జగన్‌ను కలిస్తే.. లేదా తమ కుటుంబ సభ్యులు లేదా కుమారులను వైసీపీలో చేర్పించేస్తే ఇక ఎంచక్కా ప్రత్యేక సభ్యుడిగా ఉండిపోవచ్చంతే. అంటే ఇంకా నాలుగైదేళ్లు అలానే గడిపేయచ్చు.. రాజీనామా అస్సలు చేయనక్కర్లేదు. మరి ఇదే తంతు ఎన్నిరోజులు కొనసాగుతుందో..? ప్రత్యేక సభ్యుడిగా ఎన్నిరోజులుగా స్పీకర్ ఎన్నిరోజులు గుర్తిస్తారో..? జగన్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో..? మున్ముంథు ఎమ్మెల్యేలు ఎంతమంది వైసీపీలో చేరతారో..? అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com