టీడీపీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఐటీ!

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

ఐటీ అధికారులు మామూలు రోజుల్లోనే అవినీతి తిమింగలాలపై ఉక్కుపాదం మోపుతుంటారు. ఇక ఫిర్యాదులు వస్తే మాత్రం వారిని వదిలిపెట్టరు. ఎన్నికలకు మరికొన్ని రోజులు ఉండటంతో ఇక అధికారులకు అస్సలు తీరిక ఉండదు.. ప్రతీ నేతపై ‘ఐ’ టీ అధికారులు ఓ కన్నేసి ఉంచుతారు. ఏపీలో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు అని కాకుండా అనుమానం వచ్చిన.. ఫిర్యాదులు అందిన నేతల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల కడప జిల్లాలోని మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. అయితే మధ్యలో జోక్యం చేసుకున్న టీడీపీ కీలకనేత, ఎంపీ సీఎం రమేశ్ అధికారులతో వాగ్వాదానికి దిగి వారిని బలవంతంగా అక్కడ్నుంచి పంపేయడం గమనార్హం. అధికారులతో వాగ్వాదానికి దిగడంపై రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇక తాజాగా.. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారి, టీడీపీ కీలకనేత కోవెలమూడి రవీంద్రకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలకు దిగారు. గురువారం తెల్లవారుజామున నుంచి ఇప్పటి వరకూ ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రవీంద్ర గ్యాస్‌, పెట్రోల్‌ బంకులు నిర్వాహకుడిగా స్థానికులకు సుపరిచితమే. కాగా కోవెలమూడిపై ఇలా ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మరోవైపు తమ పార్టీ నేతల ఇళ్లే లక్ష్యంగా ఐటి దాడులు జరుగుతున్నట్లు టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ దాడులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా మున్ముంథు మరికొంత మందికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.