TDP Leaders:వైసీపీ ఇంఛార్జ్‌ల మార్పుపై టీడీపీ నేతల సెటైర్లు
- IndiaGlitz, [Tuesday,December 12 2023]
వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈసారి మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్ టికెట్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన అధిష్టానం.. మొత్తం 62 చోట్ల ఇంఛార్జ్‌లను మార్చనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. జగన్ తీసుకునే నిర్ణయాలతో పార్టీలోని పలువురు నేతలు ఉలిక్కిపడతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు టీడీపీ లేదా ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారట.
ఇదిలా ఉంటే ఇంఛార్జ్‌ల మార్పుపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఇంఛార్జ్‌లను కాదు కదా.. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడినే మార్చినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవటం అసాధ్యం. వైసీపీకి ఉన్నది ఇంకా మూడు నెలలే అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్పదింస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇక మీరు ఎంతమందిని మార్చినా ఫలితం సున్నా ప్రజా వ్యతిరేక ఉందని అభ్యర్ధుల్ని మార్చుకుంటూ పోతే.. పులివెందులతో సహా మొత్తం 151మందిని మార్చాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు.
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా..? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడ్డారు. అసలు ఎమ్మెల్యేల పనితీరు కంటే సీఎం పనితీరు మీదనే జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. అతని అహంకారానికి చరమగీతం పాడేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. నియంత సీఎం తమకు అక్కర్లేదని తమ ఓట్లతో తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు.
ఇక మాజీ మంత్రి అయ్యనపాత్రుడు కూడా నాలుగున్నరేళ్లుగా బీసీలను అన్ని రకాలుగా హింసించిన జగన్ కు బీసీలపై ఇంకా కసి చల్లారలేదని ఆయన విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ చిట్టా ప్రకారం వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయే సీట్లను బీసీలకు కట్టబెట్టి... బీసీలను బలిపశువులను చేయాలని చూస్తున్నాడు అని మండిపడ్డారు. మొత్తానికి వైసీపీ ఇంఛార్జ్‌ల మార్పు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.