కేసీఆర్ నిర్ణయంపై ప్రశంసలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు
- IndiaGlitz, [Friday,September 04 2020]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ నేతలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అటు ఏపీ నేతలు, ఇటు తెలంగాణ నేతలు సైతం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. కేసీఆర్‌కు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.
తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మరోసారి ఎన్టీఆర్‌పై ఆయనకున్న అభిమానాన్ని చాటి చెప్పింది. తెలంగాణలో పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు. ఈ ఏడాది కొత్తగా రూపొందించిన సిలబస్‌లో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను పొందుపరిచారు. తెలంగాణలో అన్న గారి జీవితం పాఠ్యాంశంగా చేర్చడం ఆనందకరమని ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.
పదో తరగతి సాంఘిక శాస్త్రంలో టాప్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్.. పార్టీ పెట్టడానికి దారి తీసిన పరిస్థితులు.. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం.. అనతికాలంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికవడం.. ఎన్టీఆర్ హయంలో తీసుకొచ్చిన పలు పథకాలను వివరించారు. దీనిపై తెలంగాణ టీడీపీ సైతం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం.. ‘‘తెలంగాణలో అన్న గారి జీవితం పాఠ్యాంశంగా చేర్చడం ఆనందకరం. తెలుగుదేశం పుట్టింది తెలంగాణ గడ్డ మీద. అక్కడ ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థని తొలగించింది రామరావు గారు’’ అని ట్వీట్ చేశారు.