Janasena: జనసేనలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు.. అక్కడి నుంచి పోటీ ఖాయం..

  • IndiaGlitz, [Monday,April 01 2024]

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని టీడీపీ నేతలు జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది. టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పిఠాపురంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇద్దరు పార్టీ కండువా కప్పుకున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ, పాలకొండ స్థానాలు దక్కాయి. అయితే ఈ రెండు స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకున్నారు.

ఈ రెండు స్థానాలు జనసేనకు వెళ్లడంతో ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణకు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీకి రాజీనామా చేసి జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు పవన్ కల్యాణ్ అవనిగడ్డ, పాలకొండ స్థానాలలో పలువురు పేర్లతో జనసేన సర్వేలు చేయించారు. ఎవరిని అభ్యర్థిగా నిలబడితే గెలిచే అవకాశాలున్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి పార్టీ తరపున అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇద్దరు నేతలకు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు పార్టీలో చేరిపోయారు.

ఇదిలా ఉంటే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004, 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత సింహాద్రి రమేశ్‌బాబు చేతిలో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవ్వగా పొత్తుల కారణంగా సీటు దక్కలేదు. ఇక నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ తరుపున రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసిన జయకృష్ణ.. రెండుసార్లు వైసీపీ అభ్యర్థి కళావతి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. అయితే కూటమిలో భాగంగా సీటు రాలేదు. దీంతో ఇద్దరు జనసేన తరపున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

కాగా తెలుగుదేశం-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీట్లను ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేనాని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బలమైన నేతలను బరిలో దింపుతన్నారు. ఇప్పటికే 19 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలకు గట్టి అభ్యర్థులను నిలబెట్టారు. మిగిలిన అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు టీడీపీ నుంచి బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని వారిని పోటీకి దింపేందుకు సిద్ధమయ్యారు.