బీసీలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు.. భగ్గుమంటున్న అసంతృప్తి జ్వాలలు..
Send us your feedback to audioarticles@vaarta.com
పేరుకేమో బీసీల పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాల్భాలు పలుకుతారు. కానీ చేతలకు వచ్చేసారికి వారిని నిలువునా ముంచేస్తారు. తాజాగా బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు మరోసారి వెన్నుపోటు పొడిచారు. తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన 94మంది అభ్యర్థుల్లో బీసీలకు కేవలం 18 సీట్లు మాత్రమే కేటాయించారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో 45శాతం బీసీలకు 18 సీట్లతో సరిపెట్టారు.
కాపులకు కూడా మొండిచెయ్యే..
2014లో 43 స్థానాలు బీసీలకి ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానన్న మాటను ఆయన నిజం చేసి చూపించారు. ఇక మైనారిటీ వర్గాలను అయితే మరీ నీచంగా చూస్తూ కేవలం ఒక్క స్థానమే కేటాయించారు. కానీ కేవలం 4.5శాతం జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకు మాత్రం 20 స్థానాలు కేటయించారు. అలాగే 20శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గాలకు కేవలం 7 సీట్లు మాత్రమే కేటాయించారు. దీంతో కాపు వర్గం నాయకులు చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
బలహీన వర్గాలను మోసం చేశారు..
ఇక మిగిలిన 57 సీట్లలోనూ బీసీ, మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తారన్న నమ్మకం లేదని ఆ వర్గీయులు వాపోతున్నారు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలను మోసం చేశారని.. కేవలం అగ్రవర్ణాలు అందులోనూ తన సామాజిక వర్గం వారినే రాజ్యసభకు పంపారని గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు..
ఇదిలా ఉంటే తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశంలో అసమ్మతి భగ్గుమంటోంది. అభ్యర్థుల లిస్టులో పేర్లు లేని నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రాజీనామాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ అభ్యర్థిగా సవితను ఖరారు చేశారు. దీంతో పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథికి టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తలు టీడీపీ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీడీపీకి వరుసగా రాజీనామాలు..
ఇక టికెట్ రాకపోవడంతో గజపతినగరం టీడీపీ ఇంఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అలాగే విశాఖ పశ్చిమ సీటు ఆశించిన పాశర్ల ప్రసాద్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే కృష్ణా జిల్లా పెడన నియోజవర్గం టికెట్‌ను కాగిత కృష్ణప్రసాద్‌కు ప్రకటించడంతో ఆ పార్టీ సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారు అనుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments