బాబుకు ధైర్యం లేదు.. వైఎస్ జగన్‌కు హ్యాట్సాఫ్!

  • IndiaGlitz, [Wednesday,December 11 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం రిలీజ్‌కు నోచుకోవట్లేదు. అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఆర్జీవీ మూవీపై టీడీపీ నేతలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం నాడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి రెడ్డి ‘రాజ్యంలో కక్షరాజ్యం’ అని పేరు పెట్టాలని జేసీ సూచించారు. అయితే ఆర్జీవీ పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే పరోక్షంగా జేసీ గట్టిగానే కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు.

చంద్రబాబుకు చేతకాలేదు!
ఇక జగన్ గురించి మాట్లాడిన ఆయన తనదైన శైలిలో మరోసారి విమర్శలు గుప్పించారు. ‘జగన్ హయాంలో ఆయన తాత రాజారెడ్డి పాలన సాగుతోంది. నామినేటేడ్ పోస్టులు రెడ్లకు ఎక్కువగా ఇచ్చినందుకు సీఎం జగన్‌ను అభినందిస్తున్నాను. చంద్రబాబుకు అది చేతకాలేదు. చంద్రబాబు హయాంలో కమ్మలకు అన్యాయం జరిగింది. చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారు. రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జగన్ బాగా మాట్లాడారు. ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యమేనా? డబ్బులు లేవుగా..? మాఫియా ఉందని ఆనం మాట్లాడకుండా ఉండాల్సింది. ఎక్కడ మాఫియా లేదో చెప్పమనండి’ అని బాబు, ఆనంపై ఒకింత జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌కు హ్యాటాఫ్!
‘జగన్ గుండె ధైర్యం ఉన్న నాయకుడు. తాను చేయాలనుకున్నది చేసే నేత జగన్. ఆరోగ్యశ్రీ విషయంలో జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్. గతంలో కంటే మరెంతో మందికి ఉపయోగపడేలా ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారు. జగన్ ఎదురైతే తప్పకుండా అభినందిస్తాను.. ఈ విషయంలో చంద్రబాబు ఏమన్నా పట్టించుకోను. జగన్ ఎన్నో నామినేటెడ్ పోస్టులను రెడ్లకు ఇచ్చాడు. అందుకే నేను ఆయన్ను మెచ్చుకుంటున్నాను. చంద్రబాబుకు ఈ తరహా తెగువ లేదు’ అని జేసీ వ్యాఖ్యానించారు. అయితే జేసీ వ్యాఖ్యలకు టీడీపీ, వైసీపీ, ఆనం.. మరీ ముఖ్యంగా ఆర్జీవీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.