చంద్రబాబు సభలో తొక్కిసలాట .. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం : మన్నవ మోహనకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరులో జరిగిన చంద్రన్న కానుక, ఎన్టీఆర్ జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఉయ్యూరు ఫౌండేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన సంస్థ.. ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి ఫౌండేషన్ తరపున అన్ని విధాలుగా అండగా వుంటామని తెలిపింది. అటు తొక్కిసలాట ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ తరపున వారికి అన్ని విధాలుగా అండగా వుంటామన్న ఆయన.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
తొక్కిసలాటపై జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి :
ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. అంతకుముందు ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కానుకల కోసం దూసుకొచ్చిన జనం :
ఇదిలావుండగా.. ఉయ్యూరు ఫౌండేషన్ గత కొంతకాలంగా గుంటూరు, హిందూపూర్లలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేద ప్రజల కోసం నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం గుంటూరులో జరిగిన కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగించి వెళ్లగానే మిగిలిన వారికి నిర్వాహకులు పంపిణీ ప్రారంభించారు. కానుకలు తీసుకోవడానికి జనం ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను గోపిదేశి రమాదేవి, సయ్యద్ ఆసియా, జాన్ బీలుగా గుర్తించారు.
మృతుల కుటుంబాలకు మన్నవ మోహనకృష్ణ ఆర్ధిక సాయం:
అటు .. తొక్కిసలాట ఘటనపై టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి మన్నవ మోహన కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.3 లక్షల ఆర్దిక సాయం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు కూడా అన్ని విధాలుగా అండగా వుంటానని ఆయన తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout