JC Prabhakar Reddy:ఇంత కష్టమా, కాలికి బొబ్బలొచ్చినా లెక్క చేయట్లే.. లోకేష్‌‌ని చూసి కంటతడిపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి

  • IndiaGlitz, [Friday,April 14 2023]

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఆయన నడక సాగిస్తున్నారు. ఇప్పటికు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్రను కంప్లీట్ చేసిన నారా లోకేష్.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తన యాత్రను చేస్తున్నారు. అన్ని వర్గాలతో మమేకమవుతూ , ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పడుతున్న కష్టం చూసి టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడిపెట్టారు.

లోకేష్ తల్లిదండ్రులు, సతీమణికి చేతులెత్తి మొక్కుతున్నా :

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం, రాష్ట్రం కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని జేసీ ప్రశంసించారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి సైతం గురవుతున్నారని.. అరికాలికి బొబ్బలు వచ్చాయని చెబుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తనకే ఇలా వుంటే లోకేష్ కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ తల్లిదండ్రులు, ఆయన సతీమణికి చేతులెత్తి మొక్కుతున్నానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన బిడ్డ అస్మిత్ రెడ్డి రెండు రోజుల పాటు పాదయాత్రలో నడిస్తేనే కాళ్ల నొప్పులు వచ్చాయని.. మరి లోకేష్ జనం కోసం వందల కిలోమీటర్లు నడుస్తున్నారని జేసీ అన్నారు. ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదురైనా లోకేష్ పాదయాత్ర పూర్తి చేయాలని ప్రభాకర్ రెడ్డి కోరారు.

చంద్రబాబు అభివృద్ధిని వైఎస్ కొనసాగించారు:

ఇదిలావుండగా నారా లోకేష్ నిన్న తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్, చంద్రబాబు నాయుడులు రాజకీయంగా బద్ధ శత్రువులు అయినప్పటికీ ఎప్పుడూ వ్యక్తిగతంగా దూషించుకోలేదని గుర్తుచేశారు. ఇద్దరూ గౌరవంగా మెలిగేవారని తెలిపారు. కానీ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి దౌర్జన్యంగా వెళ్లి వేరే వాళ్ల ఇళ్లలో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైఎస్ కొనసాగించారే తప్ప చెడగొట్టలేదని లోకేష్ ప్రశంసించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ పరువు పోతోందన్నారు.