టీడీపీ పొలిట్ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా.. ఏపీ రాజకీయాల్లో కలకలం

  • IndiaGlitz, [Thursday,October 01 2020]

టీడీపీ పొలిట్ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇప్పటికే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో జాయిన్ అయ్యేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 3న జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారు. గంటా వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటి నుంచే టీడీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పుడు గల్లా అరుణ కూడా రాజీనామా చేయడంతో టీడీపీలో మరింత కల్లోలం రేగింది.

టీడీపీ పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ రాజీనామా చేశారు. బుధవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తన రాజీనామా లేఖను పంపారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో పని చేసిన ఆమె రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మనుగడ లేకపోవడంతో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గల్లా అరుణ ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీ తరపున గుంటూరు నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా గుంటూరు నుంచి తిరిగి పార్లమెంట్‌కు జయదేవ్ ఎన్నికయ్యారు.

అయితే తన రాజీనామా విషయమై గల్లా అరుణ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత కారణాలతోనే టీడీపీకి రాజీనామా చేశాను తప్ప పార్టీలు మారే తత్వం తమది కాదన్నారు. కాంగ్రెస్ ఏపీలో లేకుండా పోయే పరిస్థితి రావడంతో తాను టీడీపీకి వచ్చానని.. అయితే ఎక్కడ ఉన్నా పార్టీకి కట్టుబడి ఉంటానని గల్లా అరుణ స్పష్టం చేశారు. టీడీపీని వీడి వెళ్లేది లేదన్నారు. తన స్థానంలో పార్టీ కోసం మరింత కృషి చేసే వారిని తీసుకునేందుకు తమ నేతకు వెసులు బాటు ఇచ్చేందుకే రాజీనామా చేశానని గల్లా అరుణ స్పష్టం చేశారు.