Chandrababu:టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పుంగనూరు అంగళ్లు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. లక్ష రూపాయలు పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణల్లో చంద్రబాబు ప్రమేయం ఉందని ఆయనపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద ముదివేడు పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదలను విన్న న్యాయస్థానం నేటికి తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఈనెల 16 వరకు బెయిల్..
ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం లభించింది. ఈనెల 16వరకు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పీటీ వారెంటు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. ఇప్పుడు అంగళ్లు కేసులో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడంలో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడయ్యే అవకాశం..
మరోవైపు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. మంగళవారం జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో నేడు తుది తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments