TDP: ఎన్టీఏలో చేరిన టీడీపీ.. అధికారికంగా ప్రకటించిన బీజేపీ..
Send us your feedback to audioarticles@vaarta.com
NDAలో తెలుగుదేశం పార్టీ చేరినట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి విస్తృత కృషిచేస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలో కలిసి పనిచేసేందుకు టీడీపీ, జనసన ముందుకు వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా మోదీతో కలిసి టీడీపీ, జనసేన కృషి చేస్తాయని వివరించారు.
గతంలోనూ టీడీపీ, బీజేపీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. 1996లోనే టీడీపీ ఎన్డీఏలో చేరిందని.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో టీడీపీ భాగమైందని తెలియజేశారు. అలాగే 2014లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయని.. ఇందుకు జనసేన పార్టీ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని ఒకట్రెండు రోజుల్లో సీట్ షేరింగ్ పూర్తవుతుందని వెల్లడించారు.
టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఎన్డీయే కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికత, అద్భుత నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకెళ్తాయన్నారు. మూడు పార్టీలు దేశ ప్రగతికి కట్టుబడి ఉన్నాయని.. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల అభివృద్ధికి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాయని నడ్డా పేర్కొన్నారు.
కాగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై మూడు రోజుల పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. మిగిలిన 17 లోక్‌సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయనుంది. అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపురం, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు సమాచారం. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout