Pawan Kalyan: ఏపీకి పట్టిన వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరం: పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందని.. అది పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమండ్రిలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ భేటీ ముగిసిన అనంతరం పవన్ మాట్లాడుతూ ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో అన్ని వర్గాలను బెదిరిస్తున్నారని.. అన్ని పార్టీల నేతలను ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని.. తర్వాతే పదవులని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోమని ప్రకటించారు. ఏపీకి అనుభవజ్ఞుడైన నేత కావాలనే 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని తెలిపారు. మరోసారి ఇప్పుడు రాష్ట్రానికి అనుభవం కలిగిన నేత కావాలన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ నేతలతో భేటీ అయ్యామని చెప్పారు.

విజయదశమి రోజున భేటీ కావడం శుభసూచకం..

ఇక టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ విజయదశమి రోజున జనసేన-తెలుగుదేశం పార్టీ సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని తెలిపారు.రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు వారి సమస్యలు పరిష్కరించేందుకే కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాబోయే 100 రోజుల కార్యాచరణపై భేటీలో చర్చించామని.. ఈనెల 29, 30, 31వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని లోకేశ్‌ వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులు అని.. అప్పులు చేసి కాకుండా రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

రెండు పార్టీల నుంచి 14 మంది సభ్యులు హాజరు..

అంతకుముందు రాజమండ్రిలోని మంజీరా హోటల్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు పార్టీల నుంచి 14 మంది సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, పితాని సత్య నారాయణ.. జనసేన తరపున నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహేందర్ రెడ్డి, కొటికల పూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని పాల్గొన్నారు.