TDP-Janasena:చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
మార్చి 17న టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. మేనిఫెస్టోపై తెలుగుదేశం పార్టీ కార్యాయంలో జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి చర్చించారు. అనంతరం ఉమ్మడిగా ఏర్పాటు చేసిన సమావేశంలో అచ్చెన్న మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు.
ఈనెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. చరిత్ర సృష్టించేలా 10 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సభ ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికను అదే రోజు వివరిస్తామని చెప్పారు. సభకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని డిమాండ్ చేస్తున్నామని.. ఇవ్వని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ-జనసేన నేతలపై పోలీసుల వేధింపులు మానుకోవాలని.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇక నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్న చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వామ్యం కావాలని ఇరు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు. సూపర్ 6 నినాదంతో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామమని తెలిపారు. పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది, జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు మంచిది కాదని.. ప్రతిపక్షాలను పోలీసు యంత్రాంగంతో భయపెట్టాలని చూడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.
కాగా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో ముందంజలో ఉన్న టీడీపీ-జనసేన ఇప్పుడు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా మేనిఫెస్టోపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అలాగే రెండో జాబితాలోని అభ్యర్థులపైనా చర్చించారు. బీజేపీతో పొత్తు అంశంపై క్లారిటీ రాగానే రెండో జాబితా ప్రకటించనున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments