బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ వ్యవస్థాపకుడు
- IndiaGlitz, [Friday,February 15 2019]
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చేరిక జరిగి 24 గంటలు గడవక ముందే సీఎం చంద్రబాబుకు మరో గట్టి షాక్ తగలింది. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేశ్ పార్టీకి రాజీనామా చేసేసి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ ఘన విజయం సాధించి మంచి పాలన అందిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనంలా జగన్ గాలి వీస్తోందని.. తప్పక ముఖ్యమంత్రి అవుతారని.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో అత్యధిక సీట్లతో వైసీపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ మాట ఇస్తే దాని మీద నిలబడతారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.
ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదు..
తెలుగు జాతిని అవమానించేలా చంద్రబాబు పాలన సాగుతోంది. టీడీపీ పాలనలో రాష్ట్రంలో విపరీతమైన అవినీతి జరుగుతోంది. ఇంత అవినీతి జీవితంలో ఎప్పుడు చూడలేదు. ప్రతి పనికి 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. ఈ రకంగా రాష్ట్ర జీడీపీలో టీడీపీ నేతలు సొంతానికి లాక్కుంటున్నారు. ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలకు మిగిలేది ఏంటి?. ఒక్కొక్క టీడీపీ నేత రూ.200 కోట్లకు పైగానే దోచుకుని ఉంటారు అని రమేశ్ అనుమానం వ్యక్తం చేశారు.
టీడీపీ నన్ను మోసం చేసింది..
టీడీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అవమానకరంగా పాలన సాగిస్తోంది. 2001 నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నాను. రాజకీయంగా నన్ను చంద్రబాబు నిరాశపరిచారు. 1999లో గన్నవరం అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్ ఈ రెండు సీట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారు. అప్పటి నుంచి టీడీపీపై విరక్తి చెందాను. ఈ రోజు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితుడినయ్యాను. చేసిన వాగ్ధానాలు నెరవేర్చుతారని నమ్ముతున్నాను. టీడీపీకి 30 ఏళ్ల పాటు సేవ చేశాను. ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి తాను సాయం చేశాను. అహర్నిశలు టీడీపీకి సేవ చేశాను. ఆ పార్టీ నుంచి ఆశించలేదు. త్వరలోనే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాను అని దాసరి జై రమేశ్ స్పష్టం చేశారు.