Pawan Kalyan: అభ్యర్థులను ప్రకటించేస్తున్న పవన్ కల్యాణ్.. భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు..
- IndiaGlitz, [Tuesday,February 20 2024]
టీడీపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు రెండు పార్టీల మధ్య వైరానికి దారితీస్తోంది. ఇప్పటికే రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జనసేనానికి ఝలక్ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారని ప్రకటించారు.
సంబరాల్లో జనసైనికులు..
ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కందుల దుర్గేష్ వ్యవహరిస్తున్నారు. దీంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటూంటే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం బిక్కమొహం పెట్టుకున్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఖరారైన దగ్గరి నుంచి రాజమండ్రి రూరల్ టికెట్ తనకే అని చాలా కాలంగా బుచ్చయ్య చౌదరి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ సీనియర్ నేతనైనా తనను కాదని జనసేన అభ్యర్థికి టికెట్ ఎలా ఇస్తారని ఇప్పటికే ఫైర్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు.
గుర్రుగా టీడీపీ నాయకులు..
అయితే ఇప్పుడు అనూహ్యంగా రాజమండ్రి రూరల్ అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బుచ్చయ్య, టీడీపీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే రాజానగరం, రాజోలులోనూ టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమైన పవన్.. నాలుగు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించడం గమనార్హం.
విశాఖలో నాలుగు సీట్లు ప్రకటన..
భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, పెందుర్తికి పంచకర్ల రమేష్ బాబు, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్, యలమంచిలి నియోజకవర్గానికి సుందరపు విజయ్ కుమార్‌ను ఇంఛార్జ్‌లుగా ప్రకటించేశారు. దీంతో టీడీపీ క్యాడర్ భగ్గుమంటుంది. ఎవరినీ అడిగి ఇంఛార్జ్‌లను నియమించారని నిలదీస్తున్నారు. పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి కత్తులు నూరుతున్నారు. మరి ఇప్పుడు పెందుర్తికి పంచకర్ల రమేష్ బాబును జనసేన ఇంఛార్జ్‌గా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది.
రెండు పార్టీలు సపోర్ట్ చేసుకుంటాయా..?
ఏకంగా నలుగురికి దాదాపు టిక్కెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ నేతలు ఊరుకుంటారా? ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్లు జనసేనకు సపోర్ట్ చేస్తారా..? వాళ్ల గెలుపు కోసం పనిచేస్తారా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఐదారు సీట్ల దగ్గరే ఇంత రచ్చ జరుగుతుంటే పొత్తులో భాగంగా దాదాపు ముప్పై, నలభై జనసేనకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో తలచుకుంటేనే భయం వేస్తుందని తెలుగుదేశం సానుభూతిపరులు అంటున్నారు. దీంతో పోలింగ్ తేది దగ్గర పడే కొద్దీ ఇరు పార్టీల క్యాడర్ ఎంతవరకు మద్దతు తెలియజేసుకుంటాయో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.