బాబుకు ఊహించని షాక్.. లేడీ ఫైర్ బ్రాండ్స్ బీజేపీలోకి!
- IndiaGlitz, [Tuesday,August 20 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ అనింపిచుకుండే ఒక్క నేతా లేకపోవడం.. ఏపీలోనూ టీడీపీ ఖాళీ అవుతుండటంతో ఉన్న నేతలను అయినా పార్టీని వీడకుండా ఉండేందుకు బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అవన్నీ విఫలం అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి ఒక్కొకరుగా గుడ్ బై చెబుతూ వస్తున్న విషయం విదితమే. ఈ షాక్ నుంచి కోలుకోకమునుపే మరో ఇద్దరు లేడీ ఫైర్ బ్రాండ్స్ టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్త చంద్రబాబును కలవరపెడుతోంది. ఆ ఇద్దరు మరెవరో కాదు.. సాధినేని యామిని, దివ్యవాణి. వీరిద్దరి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వైసీపీకి ఎమ్మెల్యే రోజా ఎలాగో.. టీడీపీ ఈ ఇద్దరూ అలా అన్న మాట. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంలో.. విమర్శలను తిప్పికొట్టడంలో వీరిద్దరూ ముందు వరుసలో ఉండేవారు.
ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన విషయం విదితమే. దీంతో యామిని కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. సాధినేని యామిని టీడీపీలో చేరిన కొద్ది రోజులకే అధికార ప్రతినిధిగా పదవి దక్కించుకొని ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన విషయం విదితమే.
ఇక దివ్యవాణి విషయానికొస్తే.. ఎన్నికలకు ముందు టీడీపీని ఆకాశానికెత్తేయడం.. వైసీపీని అద: పాతాలోకానికి తొక్కేస్తూ మాట్లాడటం ఈమెకే చెల్లింది. ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలను ఏ మాత్రం కనీసం గౌరవం, మర్యాద ఇవ్వకుండా ఇష్టానుసారం మాట్లాడేసింది. అయితే టీడీపీ సైకిల్‌లో ఓవరాల్‌గా పంచర్ అవ్వడంతో దివ్యవాణి కూడా అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీ నేతలతో ఈమె టచ్‌లో ఉన్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే యామిని, దివ్య వాణి ఇద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.
కాగా.. వీరిద్దరికీ వైసీపీలో డోర్స్ క్లోజ్ అవ్వడంతో చేసేదేమీ లేక.. టీడీపీలో ఉండలేక బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో.. టీవీ చానెల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ మాత్రం పెద్దవి విప్పకపోవడం గమనార్హం. అయితే నిజంగానే వీరిద్దరూ పార్టీ మారితే మాత్రం చంద్రబాబుకు ఊహించని షాకేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.