టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే బుజ్జి హఠాన్మరణం!
- IndiaGlitz, [Thursday,December 26 2019]
తెలుగుదేశం పార్టీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాదిలోనే పార్టీకి చెందిన పలువురు నేతలు తిరిగిరాని లోకాలకు చేరుకోగా.. తాజాగా టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో సీనియర్ నేతగా, జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బడేటి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు బుజ్జికి గుండెపోటు వచ్చింది. ఆయన బాగా ఇబ్బంది పడుతుండటంతో అత్యవసర చికిత్సకై హుటాహుటిన కుటుంబసభ్యులు ఆయన్ను ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించి మార్గమధ్యలోనే బడేటి తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తరలించగా.. బుజ్జి చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బుజ్జికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పొలిటికల్ ఎంట్రీ ఇలా..!
2004లో బుజ్జి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో 2004లో చేరారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన చిరు.. ఓటమి చెందారు. ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ ఛైర్మన్‌గా కూడా పనిచేసిన ఆయన.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత కొద్దిరోజుల పాటు మిన్నకుండిపోయిన ఆయన.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో టీడీపీ తరుపున పోటీ చేసిన బుజ్జి.. ప్రస్తుత మంత్రి ఆళ్ల నానిపై 24,603 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలా ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 4072 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని చేతిలో బడేటి ఓటమిచెందారు. అలా పదవిలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్న ఆయన ఒక్కసారిగా హఠాన్మరణం చెందడంతో టీడీపీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
తరలివస్తున్న కార్యకర్తలు!
ఆంధ్రా ఆస్పత్రి నుంచి బడేటి భౌతికకాయాన్ని ఏలూరులోని స్వగృహానికి తరలించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు, బడేటి వీరాభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. కాగా.. బుజ్జి అసలు పేరు బడేటి కోట రామారావు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావుకు బుజ్జి మేనల్లుడు. ఇవాళ సాయంత్రం బుజ్జి స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ అంతిమ సంస్కారాలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు కీలకనేతలు హాజరుకానున్నట్లు తెలిసింది. మరోవైపు.. బుజ్జి భౌతిక కాయానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏలూరులోని ఆయన నివాసానికి చేరుకొని నివాళులర్పిస్తున్నారు.
ప్రముఖుల నివాళి..
బుజ్జి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుజ్జి కుటుంబ సభ్యులకు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు పరామర్శించారు. మీ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని.. చంద్రబాబు అభయమిచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా ఏలూరు అభివృద్ధికి బుజ్జి ఎంతో కృషి చేశారన్నారు. ఏలూరును స్మార్ట్‌సిటీగా చేయాలని బడేటి పరితపించారని.. ఆయన మృతి ఏలూరు నియోజకవర్గానికే కాదు.. టీడీపీకి కూడా తీరని లోటని టీడీపీ నేతలు అంటున్నారు.
బుజ్జి ప్రజల మనిషి!
‘బుజ్జి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఏలూరు ప్రాంత అభివృద్ధి కోసం పరితపించారు. బుజ్జి ప్రజల మనిషి.. బుజ్జి మృతి పార్టీకి తీరని లోటు’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. కాగా చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు.. బుజ్జి మృతికి సంతాపం తెలిపి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.